తమిళనాట జయలలిత బంగారు పాలన కొనసాగాలి
అన్నాడిఎంకె కార్యకర్తలను కలిసికట్టుగా డిఎంకెను ఓడించాలి
శశికళ సంచలన ప్రకటన
చెన్నై : తమిళనాడు దివంగత సిఎం జయలలిత సన్నిహితురాలు, ఎఐఎడిఎంకె మాజీ చీఫ్ శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు బుధవారంనాడు రాత్రి ప్రకటించారు. అయితే తమిళనాట జయలలిత వారసత్వం, ఆమె బంగారు పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. రాన్నున అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకెను ఓడించడానికి అన్నాడిఎంకె కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పోరాడాలని శశికళ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జయలలిత బతికుండగా, చనిపోయిన తర్వాత కూడా నేనెప్పుడు అధికారాన్ని ఆశించలేదు. నేను రాజకీయాలను వదిలిపెడుతున్నా. ఆమె పార్టీ మళ్లీ గెలవాలని ప్రార్థిస్తున్నా. ఆమె వారసత్వం కొనసాగాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
త్వరలో తమిళనాడులో ఎన్నికల జరగనున్న నేపథ్యంలోశశికళ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన ఆమె ఇటీవల బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ఆమె తిరిగి తనవంతు పాత్ర పోశిస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్లు నిషేధం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా పనిచేస్తారా? లేకపోతే ఆమె మేనల్లుడు దినకరన్ స్థాపించిన పార్టీలోకి వెళతారా అన్నదానిపై కూడా చర్చ సాగింది. ఇదిలావుండగా సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి కొద్ది మాసాల క్రితం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అభిమానులను నిరాశపరిచిన విషయం తెలిసిందే.