వరంగల్ రూరల్: తెలంగాణ రైతుల పొట్టకొడుతున్న బండి సంజయ్‌కి ఓట్లు అడిగేందుకు అర్హత ఉందా? అని ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌కి ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నర్సంపేట రైతుల వందేండ్ల కల అయిన రామప్ప-పాకాల, రంగాయ చెరువు ప్రాజెక్టులను అడ్డుకొని, రైతుల ప్రయోజనాలపై దెబ్బకొట్టి ఓట్లు అడిగేందుకు రావడం బిజెపికి సిగ్గుచేటన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులను ఆగం చేసింది మీరు కాదా? అని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుని రైతులకు నీళ్లివ్వకుండా చేస్తోంది బిజెపి కాదా? అని మండిపడ్డారు. బండి సంజయ్‌కి నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతారని, సమస్యలపై అవగాహన కూడా లేదని ప్రజలకు అర్థమైందన్నారు. లక్ష ఎకరాలకు రెండు పంటలకు నీళ్లిచ్చే రామప్ప, పాకాల, రంగాయ చెరువు ప్రాజెక్టులకు ఎవరు అడ్డుపడుతున్నారని అడిగారు. బిజెపోళ్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తున్నారో తెలంగాణ ప్రజలే అడగాలన్నారు.