నాసా శాస్త్రవేత్తలతో జోబైడెన్
రోదసీ శాస్త్రవేత్త స్వాతిమోహన్ సేవల్ని గుర్తు చేసిన అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్: భారతీయ అమెరికన్లు తన ప్రభుత్వంలో కీలక పదవులను పొందారని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 50రోజుల్లోనే కనీసం 55మంది భారత అమెరికన్లను కీలక పదవుల్లో నియమించారు. గురువారం నాసా శాస్త్రవేత్తలతో జరిగిన వర్చువల్ సమావేశంలో కీలక పదవులు పొందిన కొందరి పేర్లను గుర్తు చేశారు. వారిలో ఇటీవల అంగారక గ్రహంపై ప్రిసవరెన్స్ రోవర్‌ను ల్యాండ్ చేయడంలో నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్ చీఫ్‌గా వ్యవహరించిన స్వాతిమోహన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, బైడెన్‌కు ప్రసంగాల రచయితగా వ్యవహరిస్తున్న వినయ్‌రెడ్డి ఉన్నారు. అయితే, స్వాతిమోహన్ది రాజకీయ పదవి కాదన్నది గమనార్హం.
వైట్‌హౌస్‌లోనూ భారత అమెరికన్లకు చెప్పుకోదగిన కీలక పదవులు లభించాయి. సెనేట్ కమిటీ సర్జన్ జనరల్‌గా గత వారం డాక్టర్ వివేక్మూర్తిని నియమించారు. న్యాయశాఖలో అసోసియేట్ అటార్నీ జనరల్ పదవికి వనితాగుప్తా పేరు దాదాపు ఖరారైనట్టే. బైడెన్ నియమించిన భారతఅమెరికన్ మహిళల్లో ఉజ్రా జయ(పౌరభద్రతా విభాగంలో అండర్ సెక్రటరీ), మాలాఅడిగా (బైడెన్ భార్య జిల్బైడెన్కు పాలసీ డైరెక్టర్), ఆయీషాషా(వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రేటజీ విభాగంలో పార్టర్షిప్ మేనేజర్), సమీరాఫజిలీ(అమెరికా జాతీయ ఆర్థిక మండలి(ఎన్ఇసి)కి డిప్యూటీ డైరెక్టర్), సుమోనాగుహ (వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ విభాగం సౌత్ఆసియాకు సీనియర్ డైరెక్టర్), సబ్రీనాసింగ్(ఉపాధ్యక్షురాలికి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ) ఉన్నారు. వీరితోపాటు పలువురు భారతఅమెరికన్లు వివిధ శాఖల్లో పలు పదవులు పొందారు.