బెంగళూరు: తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులతో పాటుగా వారి కుటుంబ సభ్యులందరికీ కొవిడ్ టీకా వేసేందుకు అయ్యే ఖర్చును తామే భరించనున్నట్లు ప్రముఖ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్ మోటార్ ప్రకటించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఈ భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రాంభించినట్లు కంపెనీ తెలిపింది. సంస్థ మానవ వనరుల విభాగం ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు ఆనంద్ కృష్ణన్ ఈ మేరకు శనివారం ప్రకటన చేశారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలిచిందని ఆనంద్ కృష్ణన్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన డాక్టర్ ఆన్ కాల్, కొవిడ్19పై అవగాహనా కార్యక్రమాలు, మానసిక స్థైర్యం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
తాజాగా, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తొలి విడతలో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారికి 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా ఉద్యోగులకు టీకా వేసేందుకు అయ్యే ఖర్చునంతా తాము భరిస్తామని ఇప్పటికే పలు సంస్థలు ప్రకటించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ అలా ప్రకటించిన సంస్థల జాబితాలో ఉన్నాయి.
We will provide free vaccination for employees:TVS