న్యూఢిల్లీ: కొవిడ్ నిబంధనల నడుమ పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4గంటలనుంచి రాత్రి 9 గంటలవరకు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయని లోక్‌సభ సచివాలయం ఒక బులెటిన్‌లో తెలిపింది. జనవరి 29న ప్రాంభమైన పార్లమెంటు తొలివిడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు కొనసాగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం, బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిగింది. వీటితో పాటుగా వ్యవసాయ చట్టాలపైనా చర్చ జరిగిన అనంతరం పార్లమెంటు మార్చి 8వరకు వాయిదా పడింది. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ కేంద్రప్రభుత్వం తాజా సమావేశాల్లో పలు కీలక ల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
తొలి విడతలో మొత్తం 49 గంటల 17 నిమిషాల పాటు చర్చ జరిగిందని లోక్‌సభ కార్యాలయం తెలిపింది. దీనిలో అత్యధికంగా 16 గంటల 38 నిమిషాలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి తీసుకున్నట్లు ప్రకటించింది. మరో 10 గంటలు సాధారణ బడ్జెట్‌పై చర్చ జరిపేందుకు కేటాయించగా మొత్తం 117 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నట్లు తెలిపింది. మార్చి8న ప్రారంభమయ్యే రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 8న ముగుస్తాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బులెటిన్‌లో వెల్లడించారు. కాగా దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతున్న వేళ పార్లమెటంప ఆవరణలోను రెండు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పార్లమెంటు సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, ఎంపిలు వాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే.
Parliament Budget 2nd Session begin from Monday