రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేష్ తోపే హెచ్చరిక
ముంబై : మహారాష్ట్రలో కరోనా బీభత్సంగా విస్తరిస్తోంది. నగరాల్లో ప్రజల కదలికలపై ఆంక్షలు ప్రారంభమైన తరువాత కరోనా పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేష్ తోపే సోమవారం వివరాలు తెలియచేశారు. వాస్తవానికి కరోనా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడిన తరువాత కఠినమైన నిబంధనలు తీసుకోవడమౌతుందని చెప్పారు. అవసరమైతే కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ విధించ వలసి వస్తుందని హెచ్చరించారు. లాక్డౌన్పై నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా యంత్రాంగానికే విడిచి పెట్టామన్నారు. నిబంధనలకు ప్రజలు కట్టుబడి ఉండాలని, లేకుంటే పెనాల్టీని హెచ్చించడమౌతుందని చెప్పారు. సోమవారం ఒక్క రోజునే తాజా కేసులు 11,141 వరకు పెరిగాయి. 38 మంది మృతి చెందారు. గత ఏడాది జనవరిలో కరోనా ప్రారంభమైన దగ్గర నుంచి మహారాష్ట్రలో మొత్తం 22.2 లక్షల మంది కరోనా బాధితులయ్యారు.