సిద్దిపేట: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంగళవారం జరిగిన చర్చల సందర్భంగా సిఎం కెసిఆర్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో సిద్దిపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. పీఆర్టీయూ సిద్దిపేట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇంద్రాసేనారెడ్డి, శశిధర్‌శర్మ, టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మార్గదర్శకత్వంలో పీఆర్టీయూ రాష్ట్ర సంఘం నాయకులు సిఎం చర్చలు జరిపారని సమస్యలన్నింటిపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. మెరుగైన పీఆర్సీ అందిస్తామని, పదోన్నతులతో పాటు అంతర్‌జిల్లా బదిలీలు చేపడతామని కెసిఆర్ తెలిపినట్టు చెప్పారు. పండిత్ అప్‌గ్రేడేషన్‌తో పాటు ఎస్టీటీలకు పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణారెడ్డి, లక్ష్మణ్, వేమారెడ్డి, ఆర్‌సిరెడ్డి, సిద్ధేశ్వర్, ప్రభు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌రావు, రవికుమార్, పద్మ, పాతూరు సుజాత, రమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.