అదనపు కోర్టుల ఏర్పాటుకు కేంద్రం సుముఖత
న్యూఢిల్లీ: చెక్‌బౌన్స్ కేసుల్ని సత్వరం పరిష్కరించేలా చేపట్టాల్సిన చర్యల్ని సూచించేందుకు బాంబే హైకోర్టు మాజీజడ్జి ఆర్‌సి చౌహాన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారుల హాదాలను కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీంకోర్టు సూచించింది. వారి పేర్లు మార్చి 12లోగా సమర్పించాలని మెహతాకు తెలిపింది. బుధవారం దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కేంద్రం సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నది.
మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది. చెక్‌బౌన్స్ కేసుల పరిష్కారానికి అదనపు కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నుంచి సుముఖత వ్యక్తం కావడంతో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. దేశంలో చెక్‌బౌన్స్ కేసులు 35 లక్షలకుపైగా పేరుకుపోవడంపై సుప్రీంకోర్టు గత వారం విచారణ సందర్భంగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి సూచనలను కోరింది. అదనపు కోర్టుల ఏర్పాటుకు చట్టం చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. అందుకు అవసరమైన విధి, విధానాలను కమిటీ రూపొందించనున్నది.