Sunday, November 17, 2024

భక్తజనసంద్రం.. రాజన్న క్షేత్రం

- Advertisement -
- Advertisement -

శివనామ స్మరణలతో మారుమోగిన శివాలయాలు
ఉపవాస దీక్షలతో పోటెత్తిన భక్తులు
టిటిడి,ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేత
అలరించిన శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు
రాజన్నను దర్శించుకున్న విఐపీలు, మంత్రులు

Maha shivaratri festival in Telugu

మన తెలంగాణ/వేములవాడ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న క్షేత్రం… భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది. లక్షలాది మందితో ఆలయ పట్టణం కిక్కిరిసిపోయింది. హర హర మహాదేవా… శంభో శంకర.. అంటూ ఆలయ పట్టణం గురువారం మారుమోగింది. వేకువజామునుంచే దర్శనాలతో పర్వదినం ప్రారంభమైంది. పిలిచిన పలికే దేవుడు… చెంబెడు నీటితో అభిషేకిస్తే కొండంత అభయమిచ్చే భోళా శంకరుడు… లింగం రూపమే గాని విగ్రహం లేని జంగమయ్య… గొంతులో గరళం నింపుకుని అమృతం కురిపించిన స్వామి వేములవాడ రాజన్నకు భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు, తలనీలాలు సమర్పించుకుని స్వామి సన్నిధిలో సేదతీరారు. దేవాలయ ప్రాంగణంలో ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ కట్టల్లో తలనీలాలు సమర్పించారు. అనంతరం కరోనా కారణంగా ధర్మగుండం మూసివేయడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్నానపు జల్లులు(నల్లాల వద్ద) స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకొనేందుకు కోడె క్యూలైన్లో బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లో నిరిక్షించిన భక్తులకు, గర్భగుడిలోకి వెళ్లగానే మహాలఘు దర్శనంతో స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఎండ తాపం ఒక్కసారిగా పెరిగిపోవడంతో కోడె క్యూలైన్లో భక్తులు ఉక్కపోతకు గురైయ్యారు. క్యూలైన్‌లో ఏర్పాటు చేసిన బెంచీలపై కూర్చుని సేదతీరారు. స్వామి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరిన చిన్నారులు, వృద్ధ్దులు, మహిళలు తల్లడిల్లిపోయారు. చిన్నపిల్లలు రోదనలు పలువురిని కలిచివేశాయి. మంచి నీళ్ల ప్యాకెట్లు అందించినప్పటికి భక్తులకు సరిపోలేదు. స్థానికుల కోసం రాత్రి 12గంటల నుండి వేకువజామున 3 గంటల వరకు వారికి దర్శన సమయం కేటాయించగా, వారికి కూడా లఘు దర్శనం లభించింది. ఈ క్యూలైన్‌లో యాత్రికులు వెళ్లడం జరిగింది. దీంతో కొంతమంది స్థానికులకు స్వామివారి దర్శన భాగ్యం కలగలేదు. ప్రధాన ఆలయంలోకి ప్రత్యేక దర్శనాలు, సర్వదర్శనాలు, విఐపి దర్శనాలు, నాలుగు లైన్లు ఒకే ద్వారం నుండి పంపడంతో భక్తులు అవస్థలకు గురయ్యారు. విఐపిల తాకిడితో సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన ఆలయ ద్వారం చిన్నగా ఉండటంతో వేడి తీవ్రతను తట్టుకోలేక స్వల్ప తోపులాట జరిగి భక్తులు అస్వస్థల పాలయ్యారు. ఒక భక్తుడు రెండు గంటల నుండి క్యూలైన్‌లో అవస్థలు పడుతున్నామని మమ్మల్ని పంపించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. చిన్న పిల్లలతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా మంది ఆరుబయట, టెంట్ల కింద విడిది చేయడంతో ఇబ్బందులు ఎదరయ్యాయి. మంచి నీళ్లు కొనుక్కుని తాగాల్సి వచ్చింది. టెంకాయ, పూలు, బెల్లం ధరలు రెట్టింపు చేసారు. నిత్యవసర సరుకుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. వసతి గదుల కొరతతో ప్రయివేటు గదులు 1000 నుంచి 1500 వరకు ధరలు పెంచేసారు. మున్సిపల్ అధికా రులు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేసి చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేయించారు. నిజామాబాద్, వరం గల్, హైదారాబాద్, అదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యసాయి సేవా సమితితో పాటు పలు సేవా సంఘాలు భక్తులకు సేవలందించారు.
టిటిడి నుండి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పణ
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా ప్రతి సంవత్సరంలాగే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున ఉదయం 8 గంటలకే టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి సతీమణి వై.వి. స్వర్ణలత రెడ్డి ఆలయ సిబ్బంది స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు నార్త్ జోన్ ఐజి నాగిరెడ్డి దంపతులు స్వామివారిని దర్శించు కుని పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ స్వామివారి ప్రసాదంతోపాటు చిత్రపటం అందజేశారు. వారి వెంట ఈవో కృష్ణప్రసాద్, ప్రధాన అర్చకులు అప్పాల భీమన్న శర్మ ఉన్నారు.
స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల
ఉదయం 8.30 నిమిషాలకు ప్రభుత్వం తరపున స్వామి వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌లు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వీరిని మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో ఉదయం వేకువ జామునుంచే భక్తుల రద్దీ కొనసాగింది.
మాల విరమించిన శివస్వాములు
శ్రీరాజరాజేశ్వర దీక్షా పరులు నేటితో మాల విరమణ చేశారు. మండల దీక్ష,అర్ధ మండల దీక్షలను తీసుకున్న శివస్వాములు మధ్యాహ్నం 3 గంట లకే భీమేశ్వర ఆలయం చేరుకుని అక్కడి నుండి పంచామృతంతో ఊరేగింపు గా రాజన్న సన్నిధికి చేరకుంటారు. మంగళవాయిద్యాలతో పురవీధుల గుండా నృత్యాలు చేస్తూ ప్రధాన ఆలయానికి శివస్వాములు చేరుకుంటారు. ఆలయ అధికార గణం స్వాముల కోసం ప్రత్యేకంగా 4గంటల నుండి 5 గంటల వరకు దర్శన సమయం కేటాయించింది. ఇదే సమయంలో పంచా మృతం సమర్పించి అనంతరం మాల విరమణ చేస్తారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శివార్చన
రాష్ట్ర భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో సం చాలకులు మామిడి హరికృష్ణ ప్రత్యేక పర్యవేక్షణలో శివా ర్చన కార్యక్ర మం కొనసాగింది. సుమారు 2 వేల మంది కళాకారులు, వివిధ ప్రదర్శనల ద్వారా 21 గంటలపాటు నిర్వహించారు. కాకతీయుల కాలం నాటి పేరిణీ నృత్యం లో భాగంగా అంచంగాలు, విషయ వృ త్తం, గీతం, గార్గారం ప్రదర్శించారు. మహాశివరాత్రికి వచ్చిన భక్తులకు రాత్రు లు నీళ్లారం ఉండే వారికి ఒక గొప్ప ప్రద ర్శనగా ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పలువురు అతిథులతోపాటు పెద్ద ఎత్తున భక్తజనం తిలకించి పరవశించిపోయారు.
వైభవోపేతంగా మహాలింగార్చన : మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయ మహామండపంలో సాయంత్రం 6.05గంటల నుండి రాత్రి 8 గంట ల వరకు వైభవోపేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాలింగార్చన వైభవోపేతంగా చేశారు. 128 కుటుంబాలకు చెందిన అనువంశిక అర్చకుల చే ఘనంగా అర్చన జరిగింది. ఈ మహాలింగార్చనలో భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో పూజా విధానంలో పాల్గొంటారు.
లింగోద్భావం: రాత్రి 11.35గంటలకు లింగోద్భావం కాలమందు స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం ఘనంగా చేసారు. గర్భ గుడి ముందు ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌తోపాటు 11 మంది రుత్వికులతో ఈ రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News