టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ
హైదరాబాద్ః ఈనెల 14వ తేదీన జరగనున్న ఎంఎల్సి ఎన్నికలలో గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచాలని, ఈక్రమంలో తమ విలువైన ఓటును టిఆర్ఎస్ అభ్యర్థులకు వేసి వారిని గెలిపించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ కోరారు. ఎం ఎల్ సి ఎన్నికల ప్రచారం చివరి రోజైన శుక్రవారం నాడు హైదరాబాదులోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ, నిజామియ మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమకు సంబంధించిన విషయాలను చట్ట సభలలో వినిపించవచ్చునని సూచించారు. గరిష్ట ఓటింగ్ శాతం నమోదు చేయడం ద్వారా గ్రాడ్యుయేట్లు, యువకుల సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్సీలు గళం విప్పవచ్చని పేర్కొన్నారు. విద్యావంతులు ఓటు వేయడం ద్వారా హైదరాబాద్,- రంగా రెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల టిఆర్ఎస్ ఎంఎల్ సి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్. వాణీ దేవి ని గెలిపించాలని హోం మంత్రి కోరారు.
గ్రాడ్యుయేట్లందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ప్రయత్నించాలని, తద్వారా రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకావాలని అన్నారు. ఉత్తమ, సమర్థవంతమైన ఎమ్మెల్సీనీ ఎంపిక చేసి శాసనమండలికి పంపించినట్లైతే యువత, నిరుద్యోగులతో పాటు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్ల సమస్యలను కౌన్సిల్ లో చర్చిస్తారని తెలిపారు. మౌలానా ఆజాద్ యూనివర్సిటీ గొప్ప పేరున్న యూనివర్సిటీ అని,భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు . భారత దేశ సంక్షేమం కోసం తన చివరి శ్వాస వరకు పనిచేశారన్నారు. రైతుల ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావిస్తూ, ఇతర రాష్ట్రాల రైతులతో పోలిస్తే తెలంగాణ రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, రైతు బంధు, రైతు భీమా వంట పథకాలే కాకుండా రైతుల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని గుర్తు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం లో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయనీ,ఇక్కడి రైతులు ఆత్మవిశ్వాసం, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని తెలిపారు.టిఆర్ఎస్ పార్టీ సమర్థవంతమైన అభ్యర్థి ఎస్ వాణీ దేవిని నిలబెట్టిందనీ ఇప్పటివరకు ఆమె ఎటువంటి రాజకీయ మద్దతు లేకుండా యువతకు, నిరుద్యోగులకు, గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గొప్ప సేవ చేశారనీ తెలియజేశారు.
ఆమె అనేకసార్లు జాబ్ ఫెయిర్లను నిర్వహించి యువతకు ఉపాధి కల్పించారని ఆమెకు ఓటు వేసి కౌన్సిల్ కు పంపాలని కోరారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం క్రమంగా అభివృద్ధి చెందుతోందని, నేడు, తెలంగాణ రాష్ట్రానికి దేశంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు కాకుండా, ముస్లిం మైనారిటీ, మహిళల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి-భద్రతలు , వాతావరణం చక్కగా ఉన్నందున విదేశీ కంపెనీలు తెలంగాణకు తరలివస్తున్నాయనీ, ఇవి తెలంగాణ ప్రజలకు ఉపాధి కలించడంతో పాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తూ దోహద పడతాయన్నారు.