నేటి నుంచే అకోలా, పర్బణీలో లాక్‌డౌన్
ఫుణె జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు
విద్యా సంస్థలు బంద్.. మాల్స్‌కు వేళలు
సోమవారం నుంచి నాగ్‌పూర్ దిగ్బంధం
పుణెః కరోనా తీవ్రతతో మహారాష్ట్ర క్రమేపీ తిరిగి లాక్‌డౌన్‌లు , రాత్రి కర్ఫూలు, కటుతర ఆంక్షల పరిధిలోకి వెళ్లుతోంది. సోమవారం నుంచి నాగ్‌పూర్‌లో వారం రోజుల పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలులోకి వస్తుంది. ఇక మరో రెండు ప్రధాన జిల్లాలు అకోలా, పర్బణిలలో మూడురోజుల లాక్‌డౌన్ విధించాలని శుక్రవారం నిర్ణయించారు. ఈ జిల్లాల్లో లాక్‌డౌన్ శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ అమలులో ఉంటుందని అక్కడి జిల్లా అధికారులు తెలిపారు. పుణె జిల్లాలో కఠిన ఆంక్షలు అమలులోకి వస్తాయి. అక్కడ గురువారం ఒక్కరోజే 2840 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అధికారులతో సమావేశం అయ్యి పరిస్థితిని సమీక్షించారు. వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని, ఆంక్షల అమలును పరిశీలించాలని సూచించారు.
ఆ తరువాత అక్కడ ఆంక్షల విధింపు నిర్ణయం జరిగింది. దీని మేరకు ప్రధాన పట్టణం పుణేలో సోమవారం (15వ తేదీ) నుంచి కటుతర కరోనా ఆంక్షలు విధించనున్నారు. అక్కడ స్కూళ్లు ఈ నెల 31వ తేదీ వరకూ మూసివేస్తారు. ఇక మాల్స్, మార్కెట్లు తెరిచి ఉంచే వేళలను నియంత్రిస్తారు. మహారాష్ట్రలో పలు ప్రాంతాలలో రోజువారి కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఈ దశలో ఒక్కరోజు క్రితమే ప్రధాన పట్టణం నాగ్‌పూర్, పరిసర ప్రాంతాలలో ఈ నెల 15వ తేదీ నుంచి కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌కు జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజే పరిస్థితిని సమీక్షించుకుని పుణే అధికార యంత్రాంగం కరోనా కట్టడి నిబంధనలను అమలులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.పరిస్థితి సమీక్ష తరువాత పుణే డివిజనల్ కమిషనర్ సౌరభ్ రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. దీనిని అధికారికంగా లాక్‌డౌన్ అనడానికి వీల్లేదని, అయితే ప్రజల సంచారంపై నియంత్రణలకు కొన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా రాత్రి పూట అన్ని రకాల వ్యాపారాలపై ఆంక్షలు అమలులోకి వస్తాయి. సాధ్యమైనంత తొందరగా మాల్స్, దుకాణాలు, మార్కెట్లను మూసివేయాలి. ప్రజలు ఎక్కువగా గుంపులుగా సంచరించకూడదు. దేశంలో నమోదు అయిన కొవిడ్ 19 కేసులలో పుణేలోనే గరిష్టంగా అత్యధిక సంఖ్యలో కేసులున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గుర్తించి, తగు విధమైన జాగ్రత్తలకుఆదేశించింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రాతిపదికన చూస్తే పుణే జిల్లాలో అత్యధిక స్థాయిలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. పుణే సిటీ తాలూకా కాకుండా పుణే జిల్లాలో 14 తాలూకాలు ఉన్నాయి. సోమవారం నుంచి అమలులోకి వచ్చే ఆంక్షలు ఈ ప్రాంతాలన్నింటికి వర్తిస్తాయి.
స్కూళ్లు, కాలేజీలు 31వరకూ బంద్
పరిస్థితి తీవ్రత నేపథ్యంలో పుణేలో కాలేజీలు, పాఠశాలలను ఈ నెల 31వరకూ మూసి ఉంచుతారు. హోటల్స్, రెస్టారెంట్లు రాత్రి పది గంటలకు మూసి ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలి. వీటికి వచ్చే వారు ఏ సమయంలో ఎంత మంది వరకూ ఉంటున్నారనే సంఖ్యా వివరాలను తెలియచేయాల్సి ఉంటుంది. అధికారులు ఎప్పటికప్పుడు దీనిని పర్యవేక్షిస్తుంటారు. పెళ్ళిళ్లు ఇతర శుభకార్యాలు, అంత్యక్రియల ఘట్టాలకు 50 మంది హాజరిని అనుమతిస్తారు. రాత్రి పూట 11 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ రాత్రి పూట కర్ఫూ అమలులో ఉంటుంది.
అయితే దీనిని కర్ఫూగా పరిగణించకుండా, అనవసరంగా ప్రజలు ఈ సమయంలో రోడ్లపై సంచరించకుండా ఏర్పాట్లు చేస్తారు. ఉదయం పూట నడకకు వచ్చే వారికి అనుమతి ఉంటుంది. సాయంత్రం పార్క్‌లు మూసివేస్తారు. రాత్రి పూట 11 గంటల తరువాత మాల్స్, మల్టిప్లెక్స్‌లు మూసివేయాల్సి ఉంటుంది. పుణే జిల్లా వ్యాప్తంగా చూస్తే గురువారం గణాంకాల మేరకు అక్కడ 18,474 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో కొత్తగా 2840 మందికి కరోనా సోకింది. నాగ్‌పూర్, సమీప ప్రాంతాలలో సోమవారం నుంచే లాక్‌డౌన్ అమలులోకి రావడం, అప్పటి నుంచే పుణేలో కటుతరమైన ఆంక్షలు విధించడం వంటి పరిణామాలతో ఈ పట్టణాలకు అనుసంధానంగా ఉండే మహారాష్ట్రకు చెందిన పలు ప్రాంతాలలో కరోనా కలకలం చెలరేగింది.