Saturday, November 23, 2024

ఎన్నికల కమిషనర్లుగా ప్రభుత్వాధికారులా?

- Advertisement -
- Advertisement -

Government Official Can't Be State Election Commissioner

 

సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
స్వతంత్ర వ్యక్తులనే ఆ పదవిలో నియమించాలని సూచన

న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా నియమించడంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి, లేదా ఆయా ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేయకూడదని.. ఆ స్థానంలో స్వతంత్ర వ్యక్తి ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘ ప్రభుత్వాలకు సంబంధం లేని వ్యక్తులు ఎన్నికల కమిషనర్లుగా ఉండాలి. ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు చేపడుతోన్న వ్యక్తిని కూడా ఆ స్థానంలో నియమించకూడదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. పంచాయతీ ఎన్నికలపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గోవా రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కేసు విచారణలో భాగంగా జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం స్వతంత్ర వ్యక్తిని ఆ స్థానంలో నియమించాలని సూచించింది. రాష్ట్ర న్యాయకార్యదర్శిగా ఉన్న వ్యకికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గోవా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై స్టే విధిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇది సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం సూచిస్తోందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఈ రోజునుంచి పది రోజుల్లోగా నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఏప్రిల్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని గోవా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News