హైదరాబాద్: సొంతింటి కలను నిజం చేసుకునేవారికి టీ న్యూస్ ప్రాపర్టీ షో మంచి అవకాశమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైటెక్స్‌లో టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షో-2021 జరుగుతోంది. టీ న్యూస్ ప్రాపర్టీ షోను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీ న్యూస్ ప్రాపర్టీ షోను అందరూ వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతున్న గొప్ప నగరమన్నారు.
త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం కాబోతున్నాయని, ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ ద్వారా పారదర్శకత, సాంకేతికత పెరిగిందని కొనియాడారు. కరోనా తరువాత భారత దేశంలోనే అద్భుతంగా పుంజుకున్న నగరం హైదరాబాద్ అని, సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌లో వెంచర్లు చేసేందుకు పోటీ పడుతున్నాయని, ధరణి పోర్టల్ ద్వారా ఎన్నో జఠిలమైన భూసమస్యలు పరిష్కారమవుతున్నాయని, ధరణి వల్ల భూములు రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరుగుతున్నాయని వివరించారు.
ధరణి పోర్టల్ వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో వెసులుబాటు వచ్చిందని, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల జిడిపి పడిపోతుందన్నారు. ఇలాంటి ప్రాపర్టీ షోల ద్వారా ఎంతో విలువైన సమాచారం లభిస్తుందని హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురేష్ బాబు, సిజిఎం ఉపేందర్, ఇన్ పుట్ ఎడిటర్ పివి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.