Sunday, November 24, 2024

పెట్రో ధరల తగ్గింపు.. వంటగ్యాస్‌పై రాయితీ

- Advertisement -
- Advertisement -

పెట్రో ధరల తగ్గింపు.. వంటగ్యాస్‌పై రాయితీ
పరిశ్రమల్లో ఉద్యోగాలు 75 శాతం స్థానికులకే
మహిళలకు ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు
డిఎంకె వరాల వర్షం

చెన్నై: వచ్చేనెల జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డిఎంకె మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ చెన్నైలోని డిఎంకె కార్యాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల వేళ భారీ వరాలు ప్రకటించారు. మేనిఫెస్టోలో సుమారు 500కే పైగా హామీలు ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోలుపై రూ.5,డీజిలుపై రూ.4 తగ్గిస్తామని హామీ ఇచ్చింది. జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, పరిశ్రమల్లో తమిళులకే 75 శాతం ఉద్యోగాలు ఇస్తామన్నారు. విద్యార్థులకు ఉచితంగా డేటాకార్డుతో కూడిన కంప్యూటర్ పిసిలు ఇస్తామని, మహిళలకు ప్రసూతి సెలవులను 12 నెలలకు పెంచుతామని పార్టీ హామీ ఇచ్చింది. నీట్ పరీక్ష రద్దుకు శాసన సభ తొలి సమావేశంలోనే ఆర్డినెన్స్ తెస్తామన్నారు.

కార్మికులకు పాత పింఛను విధానాన్ని అమలు చేస్తామని, వంటగ్యాస్ సిలిండర్‌పై వంద రూపాయలు తగ్గిస్తామని, తమిళనాడు వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరిట కలైంజర్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చినట్లు స్టాలిన్ తెలిపారు. అన్నాడిఎంకె మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ విచారణను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. హిందూ ఆలయాల పునరుద్ధరణకు రూ.1000 కోట్లు, మసీదులు, చర్చిల పునరుద్ధరణకు రూ.200 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఆస్తి పన్ను పెంచబోమని, అలాగే ఆవిన్ పాల ధరపై లీటరుకు రూ.3 తగ్గిస్తామని,‘తిరుక్కురళ్’ను జాతీయ గ్రంథంగా కేంద్రం ప్రకటించేలా కృషి చేస్తానని స్టాలిన్ హామీ ఇచ్చారు. అలాగే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్లేందుకు లక్ష మందికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, శ్రీలంక తమిళులకు పౌరసత్వం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మెరుగైన సాగునీటి నిర్వహణ, ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ప్రభుత్వం ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెంచడం, వృద్ధాప్య పింఛన్ల పెంపులాంటిపలు హామీలు కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News