రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ కోర్సులకు తప్పనిసరి కాదు
ఎఐసిటిఇ చైర్‌పర్సన్ వివరణ
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరడానికి భౌతికశాస్త్రం, గణితం ఇంటర్‌స్థాయిలో తప్పనిసరి కాదన్న వార్తలపై సాంకేతిక విద్య నియంత్రణ సంస్థ ఎఐసిటిఇ చైర్‌పర్సన్ అనిల్ సహస్రబుద్ధే వివరణ ఇచ్చారు. ఇంజినీరింగ్ కోర్సులకు భౌతికశాస్త్రం, గణితం, రసాయనశాస్త్రం ప్రాధాన్యత కొనసాగుతుందన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని విద్యాసంస్థలకు ఈ నిబంధన తప్పనిసరి కాదన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లాంటి కోర్సుల్లో చేరడానికి ఈ మూడు సబ్జెక్టులు ప్రాధాన్యత కలిగి ఉంటాయన్నారు. అయితే, టెక్స్‌టైల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బయోకెమిస్ట్రీ కోర్సుల్లో చేరడానికి ఈ మూడు సబ్జెక్టులతో 12వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన తప్పనిసరి కాదని పేర్కొన్నారు. కోర్సుల్లో చేరిన తర్వాత వీటిని బ్రిడ్జి కోర్సుల్లో భాగంగా అధ్యయనం చేసే వీలుంటుందని తెలిపారు.
నూతన విద్యా విధానం(ఎన్‌ఇపి)లో భాగంగా ఎఐసిటిఇ నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు. 2021-22 హ్యాండ్‌బుక్‌లో నూతన నిబంధనలను పేర్కొన్నారు. ఆ ప్రకారం 14 సబ్జెక్టుల్లో ఏవేని మూడింటితో ఇంటర్ లేదా 12వ తరగతిని 45 శాతం మార్కులతో పూర్తి చేసినవారే ఇంజినీరింగ్ కోర్సులకు అర్హులు. ఆ 14 సబ్జెక్టులు ఇవిః భౌతికశాస్త్రం, గణితం, రసాయనశాస్త్రం, కంప్యూటర్‌సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, బయోలజీ, ఇన్‌ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, బయోటెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.