హెచ్1బి వీసా దారుల కనీస వేతనాల భారీ పెంపు ఆలస్యం చేస్తూ ఉత్తర్వులు
వాషింగ్టన్ : భారతీయ ఐటి నిపుణులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో శుభవార్త చెప్పారు. హెచ్-1బి వీసాల వేతనాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేశారు. హెచ్-1బి వీసాపై అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్ సర్కారు గతంలో తెచ్చిన నిబంధన అమలును మరింత ఆలస్యం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కార్మిక శాఖ శుక్రవారం ప్రచురించిన ఫెడరల్ నోటిఫికేషన్‌లో మే 14 వరకూ దీని అమలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. తమ నిర్ణయం అమెరికాలోని కొంతమంది విదేశీయుల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల వేతన ప్రయోజనాలను కాపాడనుందని తెలిపింది.
ఫలితంగా భారతీయ ఐటి నిపుణులకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కాలపరిమితిని మరింత ఆలస్యం చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ఇది మే 14 నుండి అమలులోకి రానుందని తెలిపింది. దీన్ని పొడిగించేముందు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా అమెరికా సంస్థలపై విదేశీ ఉద్యోగుల వేతన భారం తగ్గడంతోపాటు, విదేశీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయంటూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ తప్పనిసరి కనీస వేతననిబంధనను తీసుకొచ్చారు. దీనిపై ఇరువైపులా నిరసన భారీగానే వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బైడెన్ తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే బైడెన్ తాజా నిర్ణయాన్ని ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్(ఫెయిర్) సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది.