ఐఎస్ లింకులున్న ఐదుగురి అరెస్ట్
న్యూఢిల్లీ: సోమవారం ఢిల్లీ, కేరళ, కర్నాటకల్లోని 10 చోట్ల జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఎ) దాడులు నిర్వహించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో లింకులున్న అనుమానితుల కోసం ఈ దాడులు నిర్వహించింది. ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు ఎన్‌ఐఎ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని జఫ్రాబాద్‌తోపాటు మరో రెండు చోట్ల, బెంగళూర్‌లో, కేరళలోని కోచి, కన్నూర్‌లో ఈ దాడులు జరిగాయి. దీనికి సంబంధించిన కేసు నమోదైన తర్వాత 48 గంటలకు ఈ దాడులు జరిగాయి. కొంత కాలంగా ఏడుగురు అనుమానితులను నిఘా వర్గాలు గమనించిన అనంతరం కేసు నమోదైంది. పాకిస్థాన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ముస్లిం యువకుల్ని సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ చేస్తున్నట్టు ఎన్‌ఐఎ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ ద్వారా వారికి శిక్షణ ఇచ్చి, స్థానిక దాడులకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు నిఘా సమాచారమున్నదని ఆ వర్గాలు తెలిపాయి.