రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలకు విశ్వసనీయత తగినంతగా ఉండదు. ఏరు దాటుతున్నప్పుడు ఓడ మల్లయ్యగా పిలిచిన వ్యక్తినే దాటిన తర్వాత బోడి మల్లయ్యగా అవహేళన చేసి పట్టించుకోకుండా పోయే దుష్ట సంస్కృతి జీర్ణించుకుపోయిన మన రాజకీయ రంగంలో ఎన్నికల నాడు చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా నెరవేరుస్తారనే హామీ ఉండదు. అయితే ఎన్నికల ప్రణాళికల్లో గాని, ముఖ్యనేతల ప్రసంగాల్లో గాని చోటు చేసుకునే వాగ్దానాలు కొన్ని ఆయా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఉచిత విద్యుత్ వంటి హామీలు ఈ కోవలోకే వస్తాయి. తమిళనాడులో పార్టీలు ఓటర్లకు వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగించే వాగ్దానాలకే తమ మేనిఫెస్టోలలో ఎక్కువగా చోటు కల్పిస్తాయన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. వచ్చే నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో ప్రధాన రాజకీయ పక్షాలు డిఎంకె (ద్రవిడ మున్నేట్ర కజగం), ఎఐఎడిఎంకె (అఖిల భారత అన్నా డిఎంకె)లు రెండూ ఎన్నికల ప్రణాళికలను విడుదల చేశాయి.
పాలక ఎఐఎడిఎంకె రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చేసిన వాగ్దానం వీటిల్లో ప్రత్యేకించి గమనించదగినది. దేశంలో నడుస్తున్నది ప్రైవేటు యుగం, ప్రభుత్వాలు తమ మీద భారాన్ని వీలైనంతగా తగ్గించుకొని దేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను ప్రైవేటు రంగానికి బదిలీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న కాలం. ఈ లక్షాన్ని సాధించడానికి విలువైన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ప్రైవేటు రంగానికి కారుచవకగా కేంద్రం కట్టబెడుతున్నది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను వీలైనంతగా తగ్గించి వేస్తున్నారు. ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రద్దు చేయాలని కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆ మేరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు తయారు చేసి పంపించాలని కేంద్ర ఆర్థిక శాఖ అన్ని మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు గతంలో లేఖలు రాసినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలైతే ప్రభుత్వ విభాగాలు చేయవలసిన పనులను బయటి వ్యక్తులు, సంస్థలకు అప్పగించే విధానాన్ని ఏనాడో చేపట్టాయి. ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక నియామకాలతో కథ నడిపిస్తున్నాయి.
ఈ కారణంగా ఎప్పుడో గాని ప్రభుత్వ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్లు జరగడం లేదు. అందుచేత తమిళనాడులో భారీ సంఖ్యలోనే ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉండడానికి అవకాశముంది. వాటన్నింటినీ భర్తీ చేస్తారా, వాటి ద్వారా ప్రతి ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వగలుగుతారా? ఎన్ని ఉద్యోగాలు కల్పించినా ఇంకా అంత మంది నిరుద్యోగులు మిగిలిపోయే పరిస్థితి. ఇంటికొకరికి ప్రభుత్వ ఉద్యోగ వాగ్దానం నిజంగానే ప్రజల నోరు ఊరిస్తుంది. అయితే ఈ హామీ వారిని అన్నాడిఎంకె వైపు ఏ మేరకు మొగ్గిస్తుందో వేచి చూడాలి. రేషన్ కార్డులున్నవారందరికీ అమ్మ వాషింగ్ మెషిన్లను ఉచితంగా ఇవ్వడం, ప్రతి ఇంటికీ నెలకు రూ.1500 నగదు పంపిణీ వంటి వాగ్దానాలు అన్నాడిఎంకె మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి. ఇంటికొక టివి వంటి వాగ్దానాల పురిటిగడ్డ తమిళనాడేనన్న సంగతి తెలిసిందే. జయలలిత పేరును వాడుకొని అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఎఐఎడిఎంకె తహతహలాడుతున్నది. అందుకే ‘అమ్మ బ్యాంకింగ్ కార్డు’, అమ్మ హౌసింగ్ స్కీమ్’, ‘ఎంజిఆర్ గ్రీన్ ఆటో’ వంటి పథకాలను కూడా మేనిఫెస్టోలో చేర్చింది.
డిఎంకె, అన్నాడిఎంకెలు ఒకదాని తర్వాత ఒకటిగా అధికారాన్ని చేజిక్కించుకున్న సంప్రదాయానికి 2016లో జయలలిత తెర దించారు. ఫలితంగా ఎఐఎడిఎంకె వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇప్పుడు జయలలిత లేరు. ఆమె మరణానంతరం గత నాలుగేళ్లుగా పళనిస్వామి ప్రభుత్వం ఒక మాదిరి మంచి పాలన అందించిందనే పేరు తెచ్చుకున్నది. మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దానికి కలిగితే అది ఆశ్చర్యకరమే కాగలదు. కరుణానిధి తదనంతరం డిఎంకె పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు స్టాలిన్‌కు ప్రజల్లో మంచి పేరున్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో డిఎంకె కూటమి ఒక్కటి మినహా అన్ని స్థానాలను గెలుచుకున్నది.
ఈ ఎన్నికలను దాని మేనిఫెస్టోలోని వాగ్దానాలను గమనిస్తే వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామూహిక మేలు చేయగల హామీలకే ఆ పార్టీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. పెట్రోల్ ధరను లీటర్ వద్ద రూ. 5, డీజెల్ ధరను రూ. 4 తగ్గిస్తామని, పాల ధర లీటర్ వద్ద రూ. 3 లు తగ్గేలా చూస్తామని ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల రిజర్వేషన్‌ను 30 నుంచి 40 శాతానికి పెంచుతానని వగైరా వాగ్దానాలతో పాటు తమిళ ప్రజలను అధికంగా బాధించిన నీట్ ప్రవేశ పరీక్ష రద్దు కోరుతూ చట్టం చేస్తామని, రాష్ట్రంలోని ఉద్యోగాలలో 75 శాతం స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకుంటామని వగైరా వాగ్దానాలు చేసింది. ప్రజల ధనంతో అమలు చేసే వాగ్దానాలు వీలైనంతగా అభివృద్ధికి ఉపయోగపడేవి అయితే సద్వినియోగం అవుతాయి.