హైదరాబాద్: తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారానికి సిఎం కెసిఆర్ అద్భుతమైన మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారని ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు ప్రశంసించారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో ధన్యవాద తీర్మానాన్ని విప్ గువ్వల బాలరాజు ప్రతిపాదించారు. వలసల జిల్లా మహబూబ్‌నగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, సిఎం కెసిఆర్ పాలనలో పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారిందన్నారు. పాలమూరు పచ్చబడాలని సిఎం కెసిఆర్ ప్రాజెక్టులు చేపట్టారని, పాలమూరు బీళ్లకు నీళ్లొస్తే తమ పార్టీలు కొట్టుకుపోతాయని కొందరు కోర్టులకెళ్లారన్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కూడా మోడీ ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిఎం కెసిఆర్ నాయకత్వం రాష్ట్రానికి ఎంత అవసరమో… దేశానికి కూడా అంతే అవసరమన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందని సూచించారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగహక్కును కాపాడుకుంటామన్నారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని బాలరాజు మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల మీద ప్రజలకు నమ్మకం కల్పించామని, కల్యాణలక్ష్మి పథకాన్ని బిసిలు, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా వర్తింపజేసిన గొప్ప మనసు సిఎం కెసిఆర్‌దని గువ్వల ప్రశంసించారు. సిఎం కెసిఆర్‌పై అపార నమ్మకంతోనే ప్రజల సమగ్ర సర్వేకు సహకరించారని గుర్తు చేశారు.