అందాల తార ఐశ్వర్య రాజేష్ ఈ మధ్యనే హీరోయిన్గా తెలుగులో కుదురుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అలా అని చెప్పేసి ఈ అమ్మాయికి వెండితెర కొత్తేమీ కాదు. కోలీవుడ్ లో వరుసబెట్టి సినిమాలు చేస్తూనే టాలీవుడ్ ను కూడా టచ్ చేద్దామనే ఆలోచనతో ఇక్కడ అడుగుపెట్టింది. హీరోయిన్గా ఈ అమ్మాయి ఇక్కడ చేసిన ’కౌసల్య కృష్ణమూర్తి’నే మొదటి సినిమా అనుకుంటే పొరపాటే. తెలుగులో చాలాకాలం క్రితమే ఈ అమ్మాయి చైల్ ఆర్టిస్ట్‌గా ’రాంబంటు’ సినిమా చేసింది.
రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా బాపు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. చిన్నప్పుడే బాపు దర్శకత్వంలో చేసిందంటే ఈ అమ్మాయి టాలెంట్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నటన అనేది ఆమె రక్తంలోనే ఉంది మరి. ప్రముఖ నటుడు అమర్నాథ్కి ఈ అమ్మాయి మనవరాలు . హాస్యనటి శ్రీలకి మేనకోడలు . ’మల్లెమొగ్గలు’ హీరో రాజేష్‌కి కూతురు. ఈ అమ్మాయి సహజమైన నటన వెనుక ఇంతటి నేపథ్యం ఉంది. అందువల్లనే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి షూటింగు వాతావరణం, యాక్టింగ్ అలవాటే. కాకపోతే హీరోయిన్గా టాలీవుడ్‌కి కాస్త ఆలస్యంగా వచ్చింది అంతే.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో విజయ్ దేవరకొండకి ఒక జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మాయి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. నాని సరసన ’టక్ జగదీశ్’, సాయిధరమ్ తేజ్ జోడీగా ’రిపబ్లిక్’ చేస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రానున్నాయి. అయితే ఈ భామ ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ మధ్య మాత్రం కాస్త పొట్టి డ్రెస్‌లతో ఫొటో షూట్లు పెడుతూ సోషల్ మీడియాలో జోరు పెంచుతోంది. అంటే తెరపై కూడా కాస్త గ్లామర్ డోస్ పెంచే ఆలోచనతో ఉన్నట్టుంది. మరి ఈ భామ సినిమాల్లో ఎలాంటి గ్లామర్ చూపిస్తుందో చూడాలి.