విజయం వైపు దూసుకుపోతున్న వాణిదేవి
ఫస్ట్ ప్రీయార్టీలో 8,021 ఓట్ల అధిక్యం
హైదరాబాద్: మహబూబ్‌నగర్ -రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో టిఆర్‌ఎస్ హవా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ బలపర్చిన సురభి వాణిదేవి విజయం వైపు దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ నుంచి చివరి వరకు తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. మొత్తం 7 రౌండ్లుగ కొనసాగిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లో వాణి దేవి 1000 నుంచి 1500 లోపు ఆధిక్యాన్ని సాధిస్తూ వచ్చారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ముగింపు సమయానికి వాణిదేవి మొత్తం 7 రౌండ్లలో 1,12,689 ఓట్లను సాధించారు. 6 రౌండ్ల వరకు ప్రతి రౌండ్‌లోను 17 వేల పై చిలుకు ఓట్లను సాధించగా, చివరి రౌండ్‌లో సైతం అందరి అభ్యర్థులకంటే అధిక ఓట్లు సాధించి తన పట్టును నిలుపుకున్నారు.
దీంతో ఆమె బిజెపి అభ్యర్థి రాంచందర్ రావుపై 8,021 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. వాణిదేవి వరసగా మొదటి రౌండ్‌లో 17439, రెండవ రౌండ్‌లో17732, మూడవ రౌండ్‌లో నాల్గో రౌండ్‌లో 17836, ఐదవ రౌండ్‌లో 17545, ఆరో రౌండ్‌లో 17752,ఏడో రౌండ్‌లో 17406,ఎనిమిదో రౌండ్‌లో 6979, మొత్త 1,12,689 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సైతం వాణిదేవి తన హవా కొనసాగిస్తున్నారు. రెండవ రౌండ్‌లోను అందరి అభ్యర్థులకంటే ఆమెకు అధిక ఓట్లు పడుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు 37 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ కాగా వాణిదేవికి113 ఓట్లుతో మొదటి స్థానంలో ఉన్నారు.