న్యూఢిల్లీ : దేశంలో రిమోట్ ఓటింగ్ పద్థతి 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అమలులోకి రావచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు. దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టు పనులు వచ్చే రెండు మూడు నెలల్లో ఆరంభం అవుతాయని చెప్పారు. అంతా అనుకూలిస్తే రిమోట్ ఓటింగ్ 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రత్యేక ఆకర్షణ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడ శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో అరోరా మాట్లాడారు. ఐఐటి మద్రాసు, ఇతర ఐఐటిలకు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు , ఇతర విశిష్ట సంస్థలతో ఈ దిశలో సంప్రదింపులు జరిగాయి. సంబంధిత విషయంపై ఇప్పటికే రిసెర్చ్ ప్రాజెక్టు ఆరంభం అయిందని వివరించారు. నమూనా ప్రయోగాత్మక దశ వచ్చే రెండు నుంచి మూడు నెలల కాలంలో చేపడుతారని తెలిపారు. ఓటర్లు దేశంలో ఎక్కడి నుంచి అయినా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ సరికొత్త వ్యవస్థ వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ లేదా ఆన్‌లైన్ పద్థతిలో ఓటును వేసుకునేందుకు, పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసేందుకు ఈ విధానం ఉంది. కొన్ని దేశాలలో అమలులో ఉంది.
Remote voting in India 2024