ఎంఎల్‌సి ఎన్నికల ఓటములతో నిరుత్సాహంలో బిజెపి నాయకత్వం, శ్రేణులు
సిట్టింగ్ స్థానమూ కోల్పోవడంతో భవిష్యత్‌పై శ్రేణుల్లో కలవరం
అధికార టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమేనన్న ప్రకటనలు పటాపంచలు
సాగర్ ఉప ఎన్నికపై అడుగు ముందుకేయని స్థితిలో కమలం
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు
మన తెలంగాణ/హైదరాబాద్ ః రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికలలో ‘వ్యూహం తప్పింది.. కమలం వాడింది’ అని చెప్పక తప్పదు. సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్‌రంగారెడ్డిమహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపి పరాభవాన్ని మూటకట్టుకుంది. ఇక వరంగల్‌నల్గొండఖమ్మం జిల్లాలో బిజెపి గట్టి పోటీని ఇవ్వలేక చతికిలపడింది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న(సిట్టింగ్ స్థానం) కోల్పోవడంతో పాటు గతంలో రెండో స్థానంలో నిలిచిన స్థానంలో ఈ సారి నాలుగో స్థానానికి దిగజారడం కమలనాథులను కలవరపాటుకు గురిచేస్తోంది. దుబ్బాకలో గెలుపు.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల్లో వచ్చిన ఊపు ఈ ఎంఎల్‌సి ఎన్నికల్లో మచ్చుకైనా కనిపించలేదు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత.. యూత్‌లో బిజెపికి పెరిగిన ఆదరణ ఎంఎల్‌సి ఎన్నికల్లో కలిసి వస్తుందని భావించారు. ఈ ఎంఎల్‌సి ఫలితాలు రాష్ట్ర బిజెపి నాయకత్వాని ఆత్మరక్షణలో పడేశాయి. కచ్చితంగా గెలుస్తామన్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో బిజెపికి ఓటమి ఎదురు కావడంతో బిజెపి శ్రేణులు నైరాశ్యంలో పడ్డాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బిజెపి సిట్టింగ్ ఎంఎల్‌సిగా ఉన్న ఎన్.రాంచందర్‌రావుని, వరంగల్‌నల్గొండఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జి.ప్రేమేందర్‌రెడ్డిని బిజెపి బరిలోకి దింపింది. సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ని ఏ విధంగానైనా నిలబెట్టుకోవాలని కమలనాథులు శతధా యత్నించారు.
ఇందుకు ప్రతిగా అధికార టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ తన రాజకీయ చతురతను కనబర్చింది. ఎవరూ కలలోనైనా ఊహించని విధంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు కూతురు సురభి వాణిదేవిని బరిలో నిలిపింది. అటు వరంగల్‌నల్గొండఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని టిఆర్ఎస్ బరిలోకి దించింది. అధికార టిఆర్ఎస్ ఈ ఎంఎల్‌సి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను రచిస్తూ ఆయా నియోజకవర్గాల్లో వినూత్నంగా ప్రచారం నిర్వహించింది. బిజెపి సైతం వ్యూహ రచనలో పదును పెట్టినప్పటికీ అధికార పార్టీ వ్యూహ రచన ముందు నిలవలేకపోయింది. హైదరాబాద్‌రంగారెడ్డిమహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో అధికార టిఆర్ఎస్ పార్టీకి సమ ఉజ్జీగా తుదికంటా పోరులో నిలిచినప్పటికీ బిజెపి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దుబ్బాకలో అనుసరించిన వ్యూహాన్నే బిజెపి అవలంబించినప్పటికీ ఇక్కడ ఆ వ్యూహం బెడిసి కొట్టింది. జాతీయ పార్టీలను కాదని ఈ ఎన్నికల్లో స్వతంత్రులు ముందంజలో దూసుకురావడం మరోవైపు పలువురిని విస్మయపర్చింది.
కాగా, టిఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని ఈ ఎన్నికల ద్వారా చాటి చెప్పాలని బిజెపి భావించినప్పటికీ దాని పాచిక పారలేదు. రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు వాణిదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు విజయదుందుభి మోగించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కొంత మెరుగ్గా బిజెపి పావులు కదిపినా వ్యూహాత్మకంలో వెలితి బిజెపి ఓటమికి కారణమైందని, ప్రస్తుతం అది ఎక్కడ జరిగిందోనన్న పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. ఇక వరంగల్-నల్గొండ-ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా జి.ప్రేమేందర్‌రెడ్డిని బరిలో నిలిపింది. ఎంఎల్‌సి ఎన్నికల్లో జి.ప్రేమేందర్‌రెడ్డి వీక్ క్యాండిడేట్‌గా భావించిన చాలా మంది లీడర్లు అనుకున్న స్థాయిలో ఆయనకు సహకరించలేదనే చర్చ జిల్లాలో కొనసాగుతోంది. వరంగల్ జిల్లాలో యూత్ లీడర్లుగా ఎదిగిన చాలా మంది నేతలు కనీసం ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేనే లేవు. బిజెపి నేతలకు చాలా కాలేజీలు ఉన్నాయి.ఐతే సమన్వయం చేయడంలో పార్టీ అధినాయకత్వం విఫలమైందనే చర్చ వాడవాడలా కొనసాగుతోంది. ప్రముఖ బిజెపి నేతలెవరూ ప్రేమేందర్‌రెడ్డి ప్రచారంలో పాలుపంచుకోలేదు. ఎబివిపి, రాష్ట్ర సేవక్ ప్రతినిధుల సూచనలను సైతం బిజెపి అధిష్టానం పెడచెవిన పెట్టిందని చెబుతున్నారు. దీంతో ఈ ఎంఎల్‌సి నియోజకవర్గంలో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. అధికార టిఆర్ఎస్ పార్టీతో సమ ఉజ్జీగా కాదు కదా.. నాలుగో స్థానంలోకి బిజెపి దిగజారిపోయింది. 2015లో 2వ స్థానంలో ఉన్న బిజెపి ఈ సారి 4వ స్థానానికి పడిపోయింది.
ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు తీన్మార్ మల్లన్న, ప్రొ.కోదండరాంలు పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు పోటీ నివ్వడం గమనార్హం. అధికార టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ స్థానం నుంచి రెండోసారి ఎంఎల్‌సిగా గెలుపొందారు. కాగా, హైదరాబాద్‌పై పెట్టినంత దృష్టి, వరంగల్‌పై పెట్టలేదని అందుకే నాలుగో స్థానానికే పరిమితమైందన్న చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టభద్రులను పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఇక బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు సైతం ఈ ఎంఎల్‌సి ఎన్నికల్లో పెను ప్రభావాన్నే చూపాయి. మరోవైపు పెట్రోల్, డిజీల్ ధరల పెంపుతో ఇతరత్రా వస్తు వినిమయ సేవలపై అధిక భారం పడతుండటం సైతం పట్టభద్రులు బిజెపికి దూరమయ్యారని చెప్పక తప్పదు. ఇదే అంశం సైతం కమలనాథుల్లో జోరుగా చర్చ కొనసాగుతోందని వినికిడి. బిజెపిలో ఇదే ధోరణి కొనసాగితే గ్రేటర్ వరంగల్ కూడా ఇంతే సంగతులు అన్న వార్నింగ్ కూడా మొదలైంది. రెండ పట్టభద్రుల అభ్యర్థుల ఎంపిక నుంచి సరైన వ్యూహ రచన ఇత్యాది అంశాలు విశ్లేషణా పరిధిలో ప్రస్తుతం బిజెపి దృష్టి పెట్టినప్పటికీ ఈ ఎన్నికల ద్వారా బిజెపి రాజకీయంగా నష్టపోయినట్లేనని చర్చ ఊపందుకుంది.
BJP lost sitting Hyderabad Graduate MLC Seat