హైదరాబాద్: టిఎస్‌ఐపాస్ ద్వారా 15 వేల 326 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. 11వేల 896 పరిశ్రమలకు ఇప్పటికే పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. రూ.2 లక్షల 13 వేల 431 కోట్ల విలువైన పరిశ్రమలకు అనుమతులు లభించాయన్నారు. ఇప్పటివరకు రూ.97 వేల 407 కోట్లు విలువైన పరిశ్రమలు స్థాపించామని, తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఎపి పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా కూడా సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల వికేంద్రీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, 80 శాతం స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే 50 శాతం రాయితీలు ఇస్తున్నామన్నారు. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని, కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా ఎవరికి కూడా రూపాయి ప్రయోజనం కలగలేదని, వీధి వ్యాపారులకు మాత్రం పది వేల రూపాయల చొప్పున లోన్లు ఇచ్చారని కెటిఆర్ గుర్తు చేశారు.
గతంలో చెరువు కింద చేను ఉంటే… ఇప్పుడు చేను కిందికే చెరువు వచ్చిందన్నారు. తెలంగాణలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయని, సిఎం కెసిఆర్ ముందు చూపుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ప్రణాళిక రూపొందించారని, ఏ గుంటలో ఏ పంట వేశారో స్పష్టమైన సమాచారం తమకు ఉందన్నారు.