అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
కొలరెడో రాష్ట్రం సూపర్ మార్కెట్‌లో దుండగుడి కాల్పులు
పోలీసు అధికారి సహా 10 మంది మృతి
బౌల్డర్: అమెరికాలో మరోసారి తుపాకులు మోత మోగింది. కొలరెడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో గుర్తు తెలియని యువకుడు ఓ సూపర్ మార్కెట్లోకి చొరబడి వినియోగదారులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. కాల్పుల శబ్దాలకు భయపడిన స్టోర్‌లోని వినియోగదారులు ప్రాణభయంలో బైటికి పరుగులు తీశారు.అమెరికాలో వారం రోజుల వ్యవధిలో కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడం ఇది రెండోసారి. ‘బౌల్డర్‌లోని కింగ్ సూపర్ మార్కెట్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో పోటీసు అధికారి ఎరిక్ ట్యాలీ సహా 10 మంది మృతి చెందారు. కాల్పులు జరిపిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. దాడికి గల కారణాలేమిటో ఇంకా స్పష్టత రాలేదు’ అని బౌల్డర్ పోలీసు చీఫ్ మారిస్ హెరాల్డ్ విలేఖరులకు చెప్పారు. దాడి జరిగిన ప్రాంతంలో బౌల్డర్ పోలీసులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనపై కొలరెడో గవర్నర్ జారెడ్ పొలిస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ బౌల్డర్‌లో జరిగిన విషాదకర ఘటనపై దిగ్భ్రాంతికి గురయ్యా. కింగ్ సూపర్స్ వద్ద జరిగిన పరిణామాలను నిశితంగా గమనిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల అట్లాంటాలోని రెండు వేర్వేరు మసాజ్ పార్లర్లపై దుండగులు కాల్పులకు పాల్పడడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 8 మంది మరణించగా వారిలో ఆరుగురు ఆసియన్ అమెరికన్లే ఉండడం గమనార్హం. ఈ కాల్పుల ఘటనపై అమెరికాలో భారీ నిరసనలు వెల్లువెత్తాయి.
10 people including Police shot dead in US