బంజారాహిల్స్‌లోని కోట్లాది భూమికి ఎసరు
గతంలో పలువురిని మోసం చేసిన నిందితులు
రూ.7 కోట్లు తీసుకున్న మోసగాళ్లు
హైదరాబాద్: నకిలీ పత్రాలతో భూమి విక్రయించిన ఇద్దరు నిందితులను నగర సిసిఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన తిరుమల రాంచందర్ రావు, దర్పల్లి సంపత్, తిరుమల అవినాష్ కలిసి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12, సర్వే నంబర్ 102/4/2, 1,3/12 జె, టిఎస్ నంబర్ 29 ఆఫ్ 9/హెచ్‌లో ఉన్న 9.17 ఎకరాల భూమిని విక్రయించేందుకు నిర్ణయించారు. ముగ్గురు కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్45, ప్లాట్ నంబర్ 1,364లో ఉంటున్న మిహీరా బిల్డ్‌కాన్ మేనేజింగ్ పార్ట్‌నర్ చాడ సుకేష్ రెడ్డికి విక్రయిస్తామని చెప్పారు. ఇందులో 2ఎకరాలను విక్రయిస్తామని చెప్పారు. దానిని రూ.10కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. సుకేష్ రెడ్డి రూ.7కోట్లు చెల్లించారు. కానీ నిందితులు టైటిల్‌ను బదిలీ చేయకుండా ఆలస్యం చేశారు. విచారణ చేయగా నకిలీ డాక్యుమెంట్లతో మోసం చేశారని తెలియడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాడు. వారు తిరిగి ఇవ్వకపోవడంతో సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఎసిపి వెంకట్‌రెడ్డి తదితరులు దర్యాప్తు చేశారు.
two arrested for selling land with fake documents