నైజీరియాకు చెందిన డ్రగ్స్ ఏజెంట్ అరెస్టు, పరారీలో డ్రగ్స్ సరఫరాదారులు
153 గ్రాముల కొకైన్, 16గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం
పట్టుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువకుడిని ఎస్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 153 గ్రాముల కొకైన్, 16గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన జేమ్స్ మోరిసన్(28) నగరంలోని ఖైరతాబాద్, ఎంఎస్ మక్తాలో ఉంటున్నాడు. బెంగళూరులో ఉంటున్న డడ్డి బాంయ్ అలియాస్ జాన్, మైక్ తరఫున నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. అవసరం ఉన్న వారితో వాట్సాప్ కాల్ మాట్లాడుతూ గ్రాముకు రూ.6 నుంచి 8 వేలకు విక్రయిస్తున్నాడు.
గతంలో కూడా మోరిసన్ డ్రగ్స్ విక్రయించడంతో ఎక్సైజ్ సిబ్బంది ఆగస్టు,2020లో అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి డిసెంబర్,2020లో విడుదలైన మోరిసన్ మళ్లీ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో ఎక్సైజ్ సిబ్బంది అతడు ఉంటున్న ఇంటిపై దాడి చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో సిఐ చంద్రకుమార్, ఎస్సై నిజాముద్దిన్, హెచ్‌సిఎస్‌లు భాస్కర్‌రెడ్డి, అజీం, శ్రీధర్, కానిస్టేబుళ్లు ప్రకాష్, రాకేష్, శ్రీకాంత్, గోపాల్, సాయి, తేజేశ్వర్, స్రవంతి పట్టుకున్నారు.
Nigeria Drug Agent Arrested in Hyderabad