న్యూఢిల్లీ: సైన్యంలో తమను శాశ్వత ఉద్యోగులుగా(పర్మనెంట్ కమిషన్) పరిగణించాలని కోరుతూ పలువురు షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సి)కు చెందిన మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు అనుమతించింది. భారత సైన్యంలో మహిళా అధికారులు చేసిన సేవలను, వారి ఘనకీర్తిని గుర్తించడంలో యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు(ఎసిఆర్) విఫలమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మహిళా అధికారుల పనితీరును అంచనా వేయడంలో లింగ వివక్షను పాటించడంపై సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పులో వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేయడంలో ఎసిఆర్ నిర్లక్షం వహించిందని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తమకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు, ప్రమోషన్లు, తగిన ప్రయోజనాలు కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సైన్యంలోని మహిళా ఎస్ఎస్సి అధికారులు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత ఏడాది ఫిబ్రవరి 17న చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. మహిళా అధికారులకు శారీరకంగా పరిమితులు ఉంటాయన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు వారికి పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని తన తీర్పులో ఆదేశించింది.
Army’s evaluation criteria to grant Women permanent commission