న్యూయార్క్ : ప్రపంచ శాంతి సైనికుల పట్ల భారతదేశం తన ఔదార్యం చాటుకుంది. ఐరాసకు చెందిన శాంతిపరిరక్షక దళాలకు శనివారం భారతదేశం రెండు లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను సాదర కానుకగా పంపిస్తుంది . ప్రపంచంలో వేర్వేరు చోట్ల ఐరాస తరఫున శాంతి పరిరక్షక బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఇందులో వివిధ దేశాలకు చెందిన సైనికులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొవిడ్ టీకాల ఉత్పత్తి, ఇరుగుపొరుగుదేశాలకు, అవసరార్థులకు దీనిని పంపిణీ చేసే క్రమంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలిచింది. ఐరాస శాంతి దళానికి భారత్ నుంచి 200000 డోస్‌లు పంపించడం జరుగుతుందని ఫిబ్రవరిలోనే విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రకటించారు.
ఇందుకు అనుగుణంగానే ఈ టీకాలు సైనికులకు పంపిణీ చేస్తారు. అత్యంత దుర్భర పరిస్థితులు, పైగా కరోనా తీవ్రత నడుమనే విధులు నిర్వర్తించే శాంతిపరిరక్షక దళాలకు అత్యవసర ప్రాతిపదికన టీకాలు పంపించడం జరుగుతుందని మంత్రి అప్పట్లో సర్వసభకు తెలిపారు. సకల జనుల సంక్షేమ ధర్మమే పరమార్థంగా కర్తవ్యం నిర్వహించాలనే భగవద్గీత వాక్కులను ఆదర్శంగా తీసుకుని భారత్ వ్యవహరిస్తుందని చెప్పారు. శనివారం అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కొవిషీల్డ్ డోస్‌లు రెండు లక్షల వరకూ ముంబై నుంచి ఖతార్ ఎయిర్వేస్ విమానంలో కోపెన్‌హెగన్‌కు రవాణా అవుతాయి. వీటిని అక్కడ సరైన పరిరక్షణ జాగ్రత్తల నడుమ నిల్వ ఉంచి వివిధ ప్రాంతాల్లోని ఐరాస దళాలకు చేరేలా చేస్తారు.