సిజెఐ ఎస్‌ఎ బాబ్డే అభిప్రాయం
పానాజీ: సాంకేతిక మార్పుల కారణంగా భవిష్యత్తులో కోర్టు రూములు, కోర్టు సముదాయాలు చిన్నవైపోతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ కారణంగా న్యాయస్థానాల పనితీరుకు సవాళ్లు ఎదురైనప్పటికీ అధునాతన కోర్టురూముల ఏర్పాటుకు అది మార్గం చూపిందని ఆయన అన్నారు. శనివారం ఇక్కడకు సమీపంలోని పార్వోరిమ్ వద్ద బాంబే హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ కోసం కొత్తగా నిర్మించిన భవనాన్ని సిజెఐ బాబ్డే ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిజెఐ మాట్లాడుతూ పిటిషన్ల దాఖలుకు ఇ-ఫైలింగ్ విధానం రావడంతో డాటా స్టోరేజ్ చేయడానికి గదులు అవసరం భవిష్యత్తులో ఉండదని, ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా తన వంతు మౌలిక సౌకర్యాల కల్పన చేపట్టిందని ఆయన చెప్పారు. ముంబయిలో బాంబే హైకోర్టు కోసం కొత్త భవనం రావాల్సిన అవసరం కూడా ఉందని ఆయన చెప్పారు. ముంబయిలో ప్రస్తుత హైకోర్టు భవనం ఏడుగురు న్యాయమూర్తుల కోసం నిర్మించిందని, ప్రస్తుతం అక్కడ 40 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారని, ఈ భవనంలో ఇంతమంది పనిచేయడం అసాధ్యమని ఆయన చెప్పారు.