రెండు తెలుగు రాష్ట్రాలలో 2024 నాటికి అధికార పక్షం కావడమే తమ లక్ష్యం అంటూ ఈ రెండు రాష్ట్రాలలోని బిజెపి నాయకులు పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా కెసిఆర్ కంచుకోటగా భావించే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అనూహ్యంగా బిజెపి అభ్యర్థి గెలుపొందడం, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పక్షానికి పోటాపోటీగా బిజెపి డివిజన్లు గెల్చుకోవడంతో ఆ పార్టీ నాయకులలో ఉత్సాహం ఉరకలు వేసింది.
అయితే బిజెపికి అనాదిగా పట్టు కలిగిన రెండు గ్రాడ్యుయేట్ల స్థానాల నుండి ఎంఎల్‌సి ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి చెందడం ఆ పార్టీని మౌలికంగా వెంటాడుతున్న బలహీనతలు వెల్లడి అవుతున్నాయి. ‘హైప్’ సృష్టించి రాజకీయంగా తమ ఉనికి కాపాడుకొనే ప్రయత్నం తప్ప ప్రజలలోకి చొచ్చుకువెళ్లి, వారిని సమీకరించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయగల సామర్ధ్యం లేదని స్పష్టం అవుతుంది. వచ్చేనెల నాగార్జున సాగర్, తిరుపతిలలో జరుగనున్న ఉప ఎన్నికలలో కనీసం డిపాజిట్ తెచ్చుకున్నా బిజెపి భవిష్యత్‌కు భరోసా ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలే స్పష్టం చేస్తున్నారు. ఒక విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు బిజెపి ఎదుగుదలకు సానుకూలంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షాలు చతికిలబడటం, అధికార పార్టీ పట్ల సహజంగా వెల్లడయ్యే అసంతృప్తి కలసి వస్తుంది. అయితే రాజకీయ నాయకత్వం లేకపోవడమే ఆ పార్టీకి ప్రధాన శాపంగా పరిణమిస్తున్నది.
నేడు దేశంలోనే తిరుగులేని ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా 2014లో బిజెపి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు ఇప్పటి వరకు బిజెపి అధికారంలోకి రాలేకపోయిన దక్షిణాది (కర్ణాటక మినహా), తూర్పు రాష్ట్రాలలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యం అని ప్రకటించారు. ఆ తర్వాత అసోంలో బిజెపి అధికారం చేపట్టింది. పశ్చిమ బెంగాల్‌లో అధికారం వచ్చినంత పని చేసింది. జనవరి, 2015లో పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి రెండు తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన సందర్భంగా హైదరాబాద్, విజయవాడలలో 2019 నాటికి ఇక్కడ అధికార పార్టీగా మారడమే మీ ముందున్న లక్ష్యం అంటూ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇక ప్రతి మూడు నెలలకు ఒకసారి తాను వచ్చి స్వయంగా వ్యూహ రచన చేస్తానని కూడా ప్రకటించారు. అయితే ఇక్కడి నాయకుల సత్తువ పట్ల అవిశ్వాసంతోనో, మరో కారణంతోనో ఈ రాష్ట్రాలపై ఆయన దృష్టి సారింపనే లేదు.
ఒక సందర్భంగా ఈ రెండు రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వాలలో 40 శాతం ‘నకిలీ’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చాలా మంది నాయకులు ‘మీడియా ఈవెంట్’ లకు మాత్రమే పరిమితం అని, పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచే వారు లేరని కూడా గ్రహించారు. అత్యధికులు అధికార పక్షాలతో లాలూచీ వ్యవహారం గడుపుతున్నారని కూడా అంతర్గతంగానే ఆరోపణలు చెలరేగుతున్నాయి. పైగా, ఎన్నికలలో పార్టీ సీట్లను నేతలు ‘అమ్ముకొంటున్నారు’ అంటూ నేరుగా అమిత్ షాకు పోటీ చేసిన, గెలుపొందిన అభ్యర్థులు కూడా గతంలో ఫిర్యాదులు చేశారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో సగానికి పైగా ఆ తర్వాత పార్టీలో కనిపించకపోవడమో లేదా ఉన్నా మౌనంగా ఉండడమో జరుగుతున్నది. ఉద్దేశ్య పూర్వకంగా గెలిచే అభ్యర్థులను, బలమైన అభ్యర్థులను నాయకత్వం ప్రోత్సహించడం లేదని ఆరోపణలున్నాయి.
పైగా, ప్రధాన ప్రతిపక్షాల నుండి కీలకమైన నాయకులు అనేక మంది తమ ‘రాజకీయ భవిష్యత్’ కోసం బిజెపిలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారు. అయితే స్థానిక బిజెపి నేతల సామర్ధ్యం పట్ల నమ్మకం లేక చాలామంది నేతలు వెనుకడుగు వేస్తున్నారు. ఒకరిద్దరు తప్పా, కేవలం ఎక్కడా చెల్లుబాటుకాని నేతలు, రాజకీయంగా ఎటువంటి ప్రభావం చూపలేనివారు మాత్రమే ఇప్పుడు బిజెపిలో చేరుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులో కీలక భూమిక వహించిన, చిరంజీవికి సన్నిహితుడిగా వ్యవహరించి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని బలమైన రాజకీయ పక్షంగా చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక సీనియర్ నాయకుడు రాష్ట్ర బిజెపిలోని పరిస్థితులను వివరిస్తూ ‘ఇందులో వైసిపి మద్దతుదారులు, టిడిపి మద్దతుదారులు ఉన్నారు. కానీ బిజెపి కోసం పని చేసే వారే కనిపించడం లేదు’ అంటూ వాపోయారు.
ఆ విషయం తిరుపతిలో అభ్యర్థి ఎంపికలో స్పష్టమైనది. వైసిపి, టిడిపిలలోని కొందరు నేతల ప్రభావంతో అభ్యర్థి ఎంపిక చేసినట్లు కనిపిస్తున్నది. జగన్ కేసులతో సంబంధం ఉన్న మాజీ అధికారిని తమ అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా అవినీతి వ్యతిరేక పోరాటంపై రాజీ ధోరణి ప్రదర్శిస్తున్నామనే సంకేతం ఇచ్చిన్నట్లు అయింది. సామాజికంగా టిడిపి ఓట్లు చీల్చి, అధికార పక్షానికి ప్రయోజనం చేకూర్చడమే అభ్యర్థి ఎంపిక లక్ష్యంగా కనిపిస్తున్నది. మరోవంక బిజెపి ఆ ప్రాంతంలో బలపడకుండా చేయడం కోసం మూడేళ్ళుగా ఆ నియోజకవర్గంపై దృష్టి సారించిన అభ్యర్థిని కాదని టిడిపి స్థానిక ప్రముఖ నేత బంధువును తమ అభ్యర్థిగా తీసుకురావడం గమనార్హం. పార్టీ ప్రయోజనాల కన్నా ఇతర ప్రయోజనాలే అభ్యర్థి ఎంపికలో ప్రాధాన్యత వహించాయి.
ఈ రెండు రాష్ట్రాలలోని బిజెపి నేతలు ‘ఉమ్మడి నాయకత్వం’ను ప్రజల ముందు ఉంచడంలో విఫలం అవుతున్నారు. వ్యక్తిగతంగా ప్రజాకర్షణ గల నేతలు ఎవ్వరూ లేరు. గత పదేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో బిజెపి జెండా కనిపించేటట్లు చేయడం కోసం ఎన్నో కష్టాలు పడిన నాయకులు అందరిని పక్కకు నెట్టివేశారు. కొత్తగా పార్టీలో ప్రాబల్యం వహిస్తున్న నేతల గురించి పార్టీ కార్యకర్తలకే విశ్వాసం కలగడం లేదు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలను ఉత్సాహ పరచడంలో కొంత పటిమ ప్రదర్శిస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. రెండు రాష్ట్రాల కార్యవర్గాలలో కీలక పదవులలో ఉన్న అత్యధికులకు నాలుగు ఓట్లు తెచ్చే శక్తీ గాని, నలుగురు పార్టీ కార్యకర్తలను సమీకరించే సామర్ధ్యం గాని, తమకంటూ ఒక నియోజక వర్గం గాని లేనివారే కావడం గమనార్హం.
‘శ్యామ్ ప్రసాద్ ముఖేర్జీ, గురు గోల్వాల్కర్ ఫోటోలు చూపిస్తే వారెవ్వరో గుర్తు పట్టలేని వారు ఇప్పుడు మా రాష్ట్రం బిజెపిలో కీలక పదవులలో ఉన్నారు’ అంటూ ఒక మహిళా నాయకురాలు వాపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఎప్పుడు బలమైన రాజకీయ శక్తి కాలేకపోయినప్పటికీ ఆ పార్టీకి ఉద్దండులైన నాయకులు ఉండేవారు. జూపూడి యజ్ఞనారాయణ, డిఎస్పీ రెడ్డి, పివి చలపతి రావు, వి రామారావు, బంగారు లక్ష్మణ్ వంటి నేతలను పార్టీ కార్యకర్తలే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా ఎంతో గౌరవంగా చూసే వారు. అటువంటి ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు లేరని చెప్పవచ్చు. ఈ సందర్భంగా దుబ్బాకలో పార్టీకి లభించిన విజయం ఆషామాషీగా వచ్చినది కాదని మరచిపోతున్నారు. అక్కడ అభ్యర్థి ఎన్ రఘునందన్ రావు వరుసగా మూడు ఎన్నికలలో ఓటమి చెందినా నియోజక వర్గాన్ని వదిలి పెట్టలేదు. తరచూ నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఆ సానుభూతే ఆయన గెలుపులో కీలక పాత్ర వహించిందని గుర్తింపలేక పోతున్నారు.
ఆ విధంగా ఒక నియోజకవర్గాన్ని నమ్ముకొని, అక్కడ పార్టీ పని చేస్తున్న నాయకులు ఈ రెండు రాష్ట్రాలలో కలిపినా రెండంకెలలో కూడా లేరని చెప్పవచ్చు. అందుకనే పార్టీ జాతీయ నాయకత్వం వద్ద తెలుగు రాష్ట్రాల బిజెపి నేతలకు మర్యాద దక్కడం లేదు. వీరు తమ రాష్ట్రాల ప్రయోజనాల గురించి ఢిల్లీలో నోరు విప్పలేక పోతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీను ప్రైవేట్‌పరం చేసే విషయమై రాష్ట్రంలోని ప్రజల మనోభావాలను వ్యక్తం చేయడానికి ఢిల్లీ వెళ్లిన ఎపి బిజెపి నాయకులకు పరాభవమే ఎదురైనది. కనీసం ప్రధాన మంత్రిని కలవలేకపోయారు. వారు కలిసిన నేతలు ఎవ్వరి నుండి కూడా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ కూడా పొందలేకపోయారు.