మణిపూర్ ప్రభుత్వ ఆదేశాలు
గువహతి: మయన్మార్ నుంచి వచ్చే శరణార్థులకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించొద్దని మణిపూర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్నవారికి మాత్రం మానవతా దృష్టితో వైద్య సేవలు అందించవచ్చునని పేర్కొన్నది. చందేల్, తెంగ్నౌపాల్, కామ్‌జాంగ్, ఉఖ్రుల్, చురాచాంద్‌పూర్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. మయన్మార్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆందోళన జరుపుతున్నవారిపై ఆ దేశ సైన్యం అణచివేతకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్‌లోకి శరణార్థులు రాకుండా కట్టడి చేయడానికి ఈ ఆదేశాలిచ్చినట్టు భావిస్తున్నారు. ఆ రాష్ట్రంలో చేపట్టిన ఆధార్ నమోదును కూడా నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి వలస తాకిడిని ఎదుర్కొన్న రాష్ట్రంగా మణిపూర్‌లో ఇప్పుడు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి.