నందిగ్రామ్ రోడ్‌షోలో అమిత్ షా
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి సువేందు అధికారి గెలుపు ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో ఆశించిన మార్పు రావాలంటే మమత ఓటమి అనివార్యమని ఆయన వ్యాఖ్యానించారు.
మంగళవారం నాడిక్కడ బిజెపి కార్యాలయంలో అమిత్ షా విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో బూటకపు వాగ్దానాలతో ప్రజలను ఏమార్చడానికి ఎవరూ సాహసించని విధంగా నందిగ్రామ్‌లో బిజెపి అభ్యర్థికి అత్యంత భారీ మెజారిటీ లభించాలని ఆకాంక్షించారు. నందిగ్రామ్‌లో మమత ఓడిపోతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా టిఎంసి ఓటమి ఖాయమని ఆయన అన్నారు. నందిగ్రామ్‌లో ఇటీవల సంభవించిన ఒక అత్యాచార సంఘటనను ఆయన ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ బెంగాల్లో మహిళలకు ఎందుకు రక్షణ లేదని ప్రశ్నించారు. మమత పోటీచేస్తున్న నందిగ్రామ్‌కు కూతవేటు దూరంలో ఒక మహిళపై అత్యాచారం జరిగిందని, దీన్ని బట్టి రాష్ట్రంలో మహిళల పరిస్థితి అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
తన మాజీ అనుచరుడు, బిజెపిలోకి ఫిరాయించిన తన అత్యంత విధేయుడు సువేందు అధికారిపై స్వయంగా మమతా బెనర్జీ పోటీ చేస్తుండడంతో నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 1న పోలింగ్ జరగనున్న ఈ స్థానంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. అంతకుముందు, మంగళవారం ఉదయం నందిగ్రామ్‌లో అమిత్ షా భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. పూలు, బిజెపి జెండాలతో అలంకరించిన లారీపై నిలుచుని సువేందు అధికారితో కలసి అమిత్ షా ర్యాలీలో పాల్గొన్నారు.