టిఆర్ఎస్లోకి బిజెపి నేతల క్యూ
నాగార్జున సాగర్ నియోజక వర్గానికి చెందిన బిసి నాయకుడు కడారి అంజయ్య యాదవ్ బిజెపికి గుడ్‌బై
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సిఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ కండువా వేసుకున్న బలమైన యాదవ నేత
టిఆర్ఎస్ సభ్యులకు ఎర వేయాలనుకున్న బిజెపికి షాక్
మన తెలంగాణ/హైదరాబాద్: సాగర్ ఉపఎన్నికల వేళ బిజెపికి ఊహించని షాక్ తగలింది. ఆ నియోజకవర్గానికి చెందిన బలమైన బిసి నాయకుడు కడారి అంజయ్య యాదవ్ మంగళవారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆయన చివరి నిమిషం వరకు యత్నించారు. అయితే బిజెపి అధిష్టానం ఆయనను కాదని డాక్టర్ రవికుమార్ నాయక్‌ను పార్టీ అభ్యర్ధిగా ఎంపిక చేసింది. దీంతో తీవ్ర అసంతృప్తి లోనైన కడారి బిజెపిని వీడారు. దీంతో సాగర్‌లో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. వెనువెంటనే అధికార టిఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపిన కడారి అగమేఘాలపై ఎర్రవల్లిని వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సిఎం కెసిఆర్ సాదరంగా ఆహ్వానించారు. వాస్తవానికి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఆయన బలమైన బిసి నేతగా గుర్తింపు ఉంది. 2014 సంవత్సరంలో టిడిపి తరపున పోటీ చేసి 20వేల పైచిలుకు ఓట్లను సాధించారు. అయితే 2018 ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ పొత్తువల్ల ఆయనకు టికెట్ దక్కలేదు. పార్టీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన టిడిపికి గుడ్‌బై చెప్పి బిజెపిలో చేరారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచిన నోముల నర్సింహయ్య అకాల మరణం చెందడంతో ఉపఎన్నిక అనివార్యం అయింది. అనుకోకుండా వచ్చిన ఈ ఉపఎన్నికల్లో బిజెపి పక్షాన పోటీ చేయాలని కడారి అంజయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో యత్నించారు. పార్టీ పెద్దలను కలిసి తనకు ఒకసారి పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ పెద్దలకు కూడా సానుకూలంగా స్పందించడంతో చివరి క్షణం వరకు పార్టీ టికెట్ వస్తుందని ఆశించారు.
కానీ ఢిల్లీల్లో పార్టీ పెద్దలు ఆయనను పక్కన పెట్టి డాక్టర్ రవికుమార్ నాయక్‌ను ఎంపిక చేశారు. ఈ పరిణామానికి కడారి తీవ్ర అసంతృప్తికి లోనయయ్యారు. ఈ అవకాశం కోసమే నిరీక్షిస్తున్న టిఆర్ఎస్ నేతలు కడారితో మంతనాలు జరిపారు. ఆయనను టిఆర్ఎస్లోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో పార్టీ పరంగా తగు ప్రాధాన్యతను ఇస్తామని జిల్లా నేతలు కడారికి స్పష్టమైన హామి ఇచ్చారు. ఇదే విషయాన్ని వారు సిఎం కెసిఆర్‌కు ఫోన్లో వివరించారు. ఇందుకు సిఎం కూడా అంగీకరించడంతో కడారి బిజెపికి గుడ్‌బై చెప్పడం….ఆ వెనువెంటనే టిఆర్ఎస్ చేరిపోవడం అంతా శరవేగంగా జరిగిపోయింది. ఇదిలా ఉండగా కడారి అంజయ్య పార్టీన వీడకుండా చూసేందుకు బిజెపి నేతలు తీవ్ర స్థాయిలో యత్నించారు. పార్టీనీ విడవద్దను సూచించారు. భవిష్యత్తులో మంచి ప్రాధాన్య లభిస్తుందని చెప్పారు. అయినప్పటికీ కడారి తన నిర్ణయాన్ని మరోసారి పున సమీక్షించుకునే అవసరమే లేదని ఖరాఖండిగా చెప్పారు. దీంతో బిజెపి నేతలు ఆయనపై ఆశలు వదలుకోవాల్సి వచ్చింది. సాగర్‌లో టిఆర్ఎస్పై విజయం సాధించాలని కమలనాధులు ఎంతో కాలంగా ప్రత్యేకంగా స్కెచ్‌లు కూడా వేశారు. అయితే తొలిదశలోనే పార్టీకి గట్టిషాక్ తగలడాన్ని ఊహించలేకపోయారు. అయితే కడారి ఒక్కరితోనే ఇది ఆగుతుందా? లేక ఆయన బాటలో మరి కొందరు నాయకులు కూడా ఉన్నారా? తదితర అంశాలపై అన్వేషించే పనిలో బిజెపి నేతలు ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, భార్య నివేదిత కూడా అదే ఆశతో ఉన్నారు. ఆమె నామినేషన్ కూడా వేశారు. కానీ టికెట్ రాకపోవడంతో భార్య, భర్తలిద్దరూ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నరు. ఈ నేపథ్యంలో వారు కూడా ఒకటి, రెండు రోజులలో బిజెపికి గుడ్‌పై చెప్పే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కాగా కడారితో పాటు బిజెపి గిరిజన మోర్చా నాయకుడు బాబురావు నాయక్, గుర్రంపోడ్ మాజీ ఎంపిపి రామచంద్రం, పలువురు మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కూడా టిఆర్ఎస్లో చేరారు.
బెడిసి కొట్టిన బిజెపి ప్లాన్?
టికెట్ ఆశించిన భంగపడ్డ టిఆర్ఎస్ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించాలన్న బిజెపి ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టనట్లు కనిపిస్తోంది. టిఆర్ఎస్లో అసంతృప్తి నేతలు ఎవరు బయటకురాకపోగా సొంత పార్టీ నుంచే నేతలు ఆ పార్టీలోకి క్యూకట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కమలనాధులు మింగుడుపడడం లేదు. దీంతో కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా బిజెపి పరిస్థితి మారింది. కడారి అంజయ్య యాదవ్ ఇప్పటికే పార్టీ వీడగా, ఒకటి రెండు రోజుల్లో శ్రీధర్ రెడ్డి, ఆయన భార్య నివేదిత కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. టికెట్ తప్పకుండా వస్తుందని చివరి వరకూ నమ్మకంతో ఉన్నా చేజారిపోవడంతో పార్టీని వీడడమే ఉత్తమం అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సాగర్ నియోజకవర్గంలో జిన్నింగ్ మిల్లుకు సంబంధించిన సబ్సిడీలు, రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కొన్ని అనుమతులు అనివార్యం కావడంతో ఆ దిశగా అధికార పార్టీ వీరిద్దరికీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వారు కూడా దాదాపుగా పార్టీ వీడడం ఖాయమన్న ప్రచారం మరింత జోరందుకుంది.
BJP Leader Kadari Anjaiah Joins in TRS