చేదు తొలిగిన దౌత్య నీతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ భారతదేశం నుంచి చక్కెర, పత్తిని దిగుమతి చేసుకోనుంది. బుధవారం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ఇరుదేశాల మధ్య బెడిసికొట్టి స్తంభించినట్లుగా ఉన్న దౌత్య సంబంధాలలో కొంచెం కదలిక ఏర్పడింది. భారత్ నుంచి చక్కెర, పత్తి దిగుమతి ప్రక్రియను పునరుద్ధరించుకుంటున్నట్లు దేశ ఆర్థిక మంత్రిగా నియమితులు అయిన హమ్మాద్ అజర్ తెలిపారు. పాకిస్థాన్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఇసిసి)ఈ మేరకు నిర్ణయం తీసుకుందని వివరించారు. దీని మేరకు పాకిస్థాన్ త్వరలోనే ఇండియా నుంచి 5 లక్షల టన్నుల చక్కెర, పత్తి తెప్పించుకుంటుంది. గత ఏడాది మే నెలలోనే పాకిస్థాన్ ఇండియా నుంచి ఔషధాలు, ముడిపద్థారాల దిగుమతులపై ఆంక్షలను ఎత్తివేసుకుంది. ఈ మధ్యనే భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరితగతిన కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య తిరిగి సత్సంబంధాలు ఉండాలని తెలిపారు.