ముంబయి/చండీగఢ్: బిజెపి ఎంపి, బాలీవుడ్ నటి కిరణ్ ఖేర్ మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆమె భర్త, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గురువారం వెల్లడించారు. 68 సంవత్సరాల కిరణ్ ఖేర్ ప్రస్తుతం ముంబయిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వ్యాధి నుంచి ఆమె కోలుకుంటున్నారని అనుపమ్ ఖేర్ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.
వదంతులు గందరగోళం సృష్టించక ముందే తాను, తన కుమారుడు సికందర్ ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని, ఆమె త్వరగా కోలుకుని తిరిగి వస్తారని తాము దృఢంగా విశ్వసిస్తున్నామని అనుపమ్ తెలిపారు. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారని, నిత్య పోరాటయోధురాలైన తన భార్య ఈ పోరాటంలో కూడా విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేవదాస్, ఖామోష్ పానీ, వీర్ జారా, దోస్తానా తదితర చిత్రాలలో నటించిన కిరణ్ ఖేర్ 2014లో తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి టిక్కెట్‌పై చండీగఢ్‌లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ బన్సల్‌ను ఓడించారు. 2019 ఎన్నికల్లో కూడా ఆమె అక్కడి నుంచే గెలుపొందారు.
Kirron Kher suffering from blood cancer