వాహనదారులపై మరింత భారం
వాహనానికి ఇరువైపులా కలిపి కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.25ల వరకు
నెలవారి పాస్‌కు కనిష్టంగా రూ.90 నుంచి గరిష్టంగా రూ.590లు
లోకల్ పాస్‌కు రూ.10లను పెంచుతూ గుత్తేదారు సంస్థల నిర్ణయం
ఏడాదిపాటు ఈ ధరలు అమల్లో బుధవారం నుంచే అర్థరాత్రి నుంచే పెరిగిన ధరలు వసూలు
మనతెలంగాణ/హైదరాబాద్: వాహనదారులపై మరో భారం పడింది. అసలే పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలపై మరింత భారం పడింది. నేషనల్ హైవేలపై టోల్ చార్జీలు పెంచుకోవడానికి ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలపడంతో టోల్ చార్జీలు పెంచుతూ గుత్తేదారు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో వాహనానికి ఇరువైపులా కలిపి కనిష్టంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ. 25ల వరకు పెంచారు. ఒక్కో వాహనానికి రానుపోనూ కలిపి కనిష్టంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ. 25 వరకు, నెలవారి పాస్‌కు కనిష్టంగా రూ. 90 నుంచి గరిష్టంగా రూ.590 వరకు, లోకల్ పాస్‌కు రూ. 10ల వరకు పెంచారు. హైదరాబాద్ టు -విజయవాడ (65), హైదరాబాద్ టు భూపాలపట్నం (163) జాతీయ రహదారులను బిఓటి పద్ధతిలో టోల్‌ఫ్లాజాలను నిర్మించారు. అయితే కాంట్రాక్ట్ సంస్థలు ఏడాదికోసారి టోల్ చార్జీలను పెంచుకునే వెసులుబాటును ఎన్‌హెచ్‌ఏఐ కల్పించడంతో చార్జీలను పెంచుతూ గుత్తేదారులు నిర్ణయం తీసుకున్నారు. చార్జీల పెంపునకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలపడంతో యాదాద్రి జిల్లాలోని పంతంగి, గూడురు, నల్గొండ జిల్లాలోని కొర్లపహాడ్, ఎపిలోని జగ్గయ్యపేట చిల్లకల్లు జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల దగ్గర బుధవారం అర్థరాత్రి నుంచే కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. ఏడాది కాలం పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయి.
పంతంగి టోల్‌ప్లాజా దగ్గర:
హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్‌కు ఒకవైపు రూ.80, ఇరువైపులా కలిపి రూ.120 టోల్‌చార్జీలను వసూలు చేస్తున్నారు. లైట్ కమర్షియల్, గూడ్స్ వెహికల్, మినీ బస్సుకు ఒకవైపు రూ.130, ఇరువైపులా కలిపి రూ.190లు. బస్సు, ట్రక్కు (2 యాక్సిల్)కు ఒకవైపు రూ.265, ఇరువైపులా కలిపి రూ.395గా టోల్ చార్జీలను నిర్ణయించారు.
కొర్లపహాడ్ టోల్‌ప్లాజా దగ్గర:
కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్‌కు ఒకవైపు రూ. 110, ఇరువైపులా కలిపి రూ.165లు లైట్ కమర్షియల్, గూడ్స్ వెహికల్, మినీ బస్సుకు ఒక వైపు రూ.175, ఇరువైపులా కలిపి రూ. 260లు బస్సు, ట్రక్కు (2 యాక్సిల్)కు ఒక వైపు రూ. 360, ఇరువైపులా కలిపి రూ. 540లుగా నిర్ణయించారు.
గూడురు టోల్‌ప్లాజా దగ్గర:
హైదరాబాద్ టు భూపాలపట్నం జాతీయ రహదారిపై కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్‌కు ఒకవైపు రూ. 100, ఇరువైపులా కలిపి రూ.150లు. లైట్ కమర్షియల్, గూడ్స్ వెహికల్, మినీ బస్సుకు ఒకవైపు రూ. 150, ఇరువైపులా కలిపి రూ. 225లు బస్సు, ట్రక్కు (2 యాక్సిల్)కు ఒకవైపు రూ. 305, ఇరువైపులా కలిపి రూ. 460లుగా నిర్ణయించారు.భారీ, అతి భారీ వాహనాల రుసుములు కూడా రూ.20 నుంచి రూ. 35 వరకు పెరిగింది.
NHAI allows to hike Toll Plaza prices