48 మంది మృతి..100 మందికిపైగా గాయాలు
తైపీ: కొండపై నుంచి జారిపడిన గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొనడంతో తూర్పు తైవాన్లో శుక్రవారం ఒక రైలు పాక్షికంగా పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 48 మంది మరణించడగా పలువురు గాయపడ్డారు. కొన్ని రైలు బోగీలు సొరంగంలోనే ఉండిపోవడంతో ప్రయాణికులు కిటికీల నుంచి బయటపడి రైలు పైకి చేరుకుని నడుచుకుంటూ వెలుపలకు చేరుకున్నారు. ప్రకృతి రమణీయ ప్రదేశంగా గుర్తింపు పొందిన టొరోకో లోయ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.
తైవాన్ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా భావిస్తున్న ఈ సంఘటనలో వందమందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. దాదాపు 400 మంది ప్రయాణికులు రైలులో ఉన్నట్లు జాతీయ ఫైర్ సర్వీస్ ప్రకటించింది. కొండపైన పనులు చేయడానికి ఉంచిన తైవాన్ రైల్వేలకు చెందిన ఒక ట్రక్కు పట్టాలపై జారి పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలో ట్రక్కులో ఎవరూ లేరని ఆయన చెప్పారు. సొరంగం నుంచి రైలు బయటకు వస్తుండగా ఈ సంఘటన జరగడంతో కొన్ని బోగీలు సొరంగంలోనే ఉండిపోయాయని ఆయన చెప్పారు.