మైసూర్: తాగిన మైకంలో ఓ వ్యక్తి దుష్ట చర్యకు ఆరుగురు బలయ్యారు. కర్నాటకలోని కొడగు జిల్లా ముగుతగేరి గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఓ ఇంటికి తాళం వేసి పై కప్పును కొంత తొలగించి లోపలికి పెట్రోల్ పోసి దుండగుడు నిప్పంటించాడు. దాంతో, చెలరేగిన మంటల్లో 9మంది చిక్కుకోగా, ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. కాలిన గాయాలతో మిగతావారిని హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. దుండగుడు ఈ చర్యకు పాల్పడుతున్నపుడు వారంతా గాఢనిద్రలో ఉన్నారు. ఈ దుష్ట చర్యకు పాల్పడింది యెరవారబోజ(50)గా గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బోజకు తన భార్య బేబీతో గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. వారం క్రితం ఆమె తన సోదరుడైన మంజు ఇంటికి చేరుకోగా, బోజ ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో, మంజు ఇంటిని తగులబెట్టాడని స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో బేబీతోపాటు మంజు కుమారులిద్దరున్నారు.
6 including 4 children burnt to death in Karnataka