మమతకు ఇసి జవాబు
న్యూఢిల్లీ : నందిగ్రామ్ పోలింగ్‌కు సంబంధించి బెంగాల్ సిఎం మమత బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇవి నిరాధారం, అవాస్తవికం అని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) ఉన్నతాధికారి జనరల్ ఉమేష్ సిన్హా శనివారమే మమత బెనర్జీకి ఓ లేఖలో తెలిపారు. నందిగ్రామ్ పోలింగ్ బూత్‌ల వెలుపల వెలుపలి వ్యక్తులు ఉన్నారనే మమత వాదనలో ఎటువంటి నిజం లేదని, ఈ విషయం తమ పూర్తి స్థాయి నిర్థారణలో తేలిందని వివరించారు. ఎప్రిల్ 1వ తేదీన పరిణామాల గురించి వేర్వేరుగా పరిశీలించామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి కానీ, ఇతరత్రా ఎన్నికల చట్టాల నిబంధనల కిందికి కానీ ఈ ఘటనలు వస్తాయా? చర్యలకు అవకాశం ఉందా? అనే విషయాలను కూలంకుషంగా పరిశీలించినట్లు తెలిపారు. పోలింగ్ బూత్‌ల వద్ద అనుచిత ప్రవర్తన, ఓటర్లను ప్రభావితం చేసేలా కొందరు అక్కడికి వచ్చిచేరడం వంటి వాటికి సంబంధించిన సెక్షన్ల పరిధిలో కూడా ఎన్నికల సంఘం పరిశీలనకు దిగింది. అయితే ఈ సెక్షన్ల పరిధిలో ఎవరిపై అయినా ఏ విధమైన చర్యకు దిగే అవకాశం ఉందా? లేదా అనే విషయాలను ఇసి స్పష్టం చేయలేదు. పోలింగ్ దశలో అక్రమాలు జరిగాయనే మమత బెనర్జీ వాదనను తోసిపుచ్చుతున్నట్లు ఈ లేఖలో తెలిపారు. అంశాల వారిగా ఇసి తమ వివరణ ఇచ్చుకుంది.