మూడేళ్లలో 20 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని యోచన
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలకు క్రమంగా గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో తమ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పరిష్కరించేలా రోడ్డు పక్కన ఉండే సాధారణ మెకానిక్‌లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రానున్న మూడేళ్లలో మొత్తం 30 వేల మందికి శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. దీనివల్ల విద్యుత్ వాహనాల కొనుగోలుదారుల్లోను విశ్వాసం పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 1500 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన హీరో ఎలక్ట్రిక్ 4000 మంది మెకానిక్‌లకు శిక్షణ కూడా ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో 53 వేల విద్యుత్ వాహనాలను విక్రయించిన సంస్థ రాబోయే రెండేళ్లలో 20వేల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. వినియోగదారులకు తోడుగా ఉండి వారి రోజువారీ సమస్యలను పరిష్కరించి వారికి అండగా ఉండేందుకే శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు హీరో ఎలక్ట్రిక్ ఎండి నవీన్ ముంజల్ తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు వేల మందికి శిక్షణ ఇచ్చామని, రాబోయే మూడేళ్లలో 20 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు.