డెహ్రాడూన్: ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు స్నేహితులు తుపాకీ పట్టుకొని వేట కోసం అడవికి బయలు దేరారు. దారి మధ్యలో తుపాకీ పట్టుకున్న వ్యక్తి కింద జారి పడడంతో అకస్మాత్తుగా తుపాకీ పేలడంతో ఒకరు మృతి చెందారు. దీంతో మిగితా ఆరుగురు ఆందోళనకు గురయ్యారు. ముగ్గురు ఘటనా స్థలంలోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుండీ గ్రామానికి చెందిన రాజీవ్(22)కు తుపాకీ ఉంది. ఏడుగురు స్నేహితులతో రాజీవ్ అడవికి వేటకు వెళ్లాడు. నడుస్తున్న క్రమంలో రాజీవ్ కిందజారిపడ్డాడు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో బుల్లెట్ వెళ్లి సంతోష్ చాతీలోకి దిగింది. దీంతో సంతోష్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దీంతో వెంటనే రాజీవ్ అక్కడి నుంచి పారిపోయాడు. భయానికి గురైన శోభన్, పంకజ్, అర్జున్ విష గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నారు. మిగితా ఇద్దరు రాహుల్, సుమిత్ గ్రామానికి వెళ్లి ప్రజలకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థులు అక్కడికి చేరుకునేసరికి ఇద్దరు మృతి చెందగా శోభన్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. శోభన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా 22 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు కావడం గమనార్హం
వేటకు వెళ్లిన స్నేహితులు.. బుల్లెట్ తాకి ఒకరు మృతి… ముగ్గురు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -