గత నాలుగు రోజుల నుంచి ఆసుపత్రులకు పెరిగిన గిరాకీ
రోజుకు 100మందికి టీకా వేస్తున్న కార్పొరేట్ దవాఖానలు
వ్యాక్సిన్ వచ్చిన జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మార్చిలో పాఠశాలలు, వసతిగృహాల్లో ఉండే చిన్నారులపై పంజా విసిరిన వైరస్ చాపకింది నీరుల్లా నగరమంతా వ్యాప్తిస్తుంది. గత పది రోజలు నుంచి పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతూ సోమవారం 323మంది మంది సోకింది. దీంతో మహానగర ప్రజలు కరోనా ముప్పుతప్పదని ఆందోళన వ్యక్తం చేస్తూ సమీపంలో ఉండే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులో కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు బారులు కడుతున్నారు. మొన్నటి వరకు నిర్లక్ష్యం వహించిన జనం కేసుల సంఖ్య పెరగడంతో తమకు వస్తుందనే భయంతో టీకా కోసం ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. గత వారం రోజుల కితం కేంద్ర వైద్యశాఖ 45సంవత్సరాల కలిగిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రకటించడంతో చాలామంది ముందుగా టీకా తీసుకుంటే వైరస్ సోకిన తట్టుకునే శక్తి ఉంటుందని భావిస్తూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ. 250 చెల్లించి వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆసుపత్రులు సిబ్బంది వెల్లడిస్తున్నారు.
అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా పంపిణీ చేయడంతో రోజుకు 50నుంచి 60మంది వస్తున్నట్లు ఉస్మానియా ఆసుపత్రి ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మహానగరం పరిధిలో 14 ప్రభుత్వ ఆసుపత్రులు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు, పిహెచ్‌సీ,యుపిహెచ్‌సీలతో పాటు 19 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో టీకా సెంటర్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ 8 లక్షల వ్యాక్సిన్ సిద్దంగా ఉంచి ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు సిబ్బందిని అందుబాటులో ఉంచి రోజుకు 200మంది వేసుకునేలా సౌకర్యాలు కల్పించారు. పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఉచితంగా టీకా వేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, కోఠి జిల్లా ఆసుపత్రికి రోజుకు 50మందికిపైగా వ్యాక్సిన్ కోసం వస్తున్నట్లు, ప్రైవేటు ఆసుప్రతులకు కూడా పెద్ద సంఖ్యలో వెళ్లుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం ఆసుపత్రులకు వెళ్లితే సిబ్బంది త్వరగా టీకా వేయరని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో త్వరగా తీసుకునే అవకాశంతో పాటు సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 60సంవత్సరాల పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా ప్రారంభించగా, ఇటీవల 45 సంవత్సరాల కూడా టీకా తీసుకోవచ్చని వ్యాక్సిన్లు మరో 2లక్షలు సరఫరా చేయడంతో జనం టీకా కోసం మొగ్గు చూపుతున్నారని, టీకా కోసం మరో పదిరోజుల పాటు జనం రద్దీ ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. నగర ప్రజలు వ్యాక్సిన్ వచ్చిందని కోవిడ్ నిబంధనలు పాటించకుంటే వైరస్ కాటుకు బలికాక తప్పదని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.