బెంగాల్ ఎన్నికలపై అమిత్ షా ధీమా
డోమ్‌జూర్(ప.బెంగాల్): పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో బిజెపి 63 నుంచి 68 స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటివరకు 91 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. మరో ఐదు దశలలో పోలింగ్ జరగవలసి ఉంది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తొలి మూడు దశల పోలింగ్‌లో 63 నుంచి 68 స్థానాలను బిజెపి కచ్ఛితంగా గెలుచుకుంటుందని హౌరా జిల్లాలో దోమ్‌జూర్ వద్ద బిజెపి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కన్నా అధిక స్థానాలను బిజెపి గెలుచుకుంటుందని ఆయన అంచనా వేశారు. మిగిలిన ఐదు దశలలో కూడా బిజెపి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని 200 మేరకు స్థానాలలో విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.
Amit Shah said BJP would win 68 seats in Bengal