కరోనా నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు
అనుమతి లేకుండా పార్టీలు, సమావేశాలు నిర్వహించవద్దు
పుట్టిన రోజు వేడుకలు చేసిన రౌడీషీటర్‌పై కేసు
హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో నగర పోలీసులు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన పోలీసులు తాజాగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం గుంపులుగా ఒకదగ్గరికి చేరడం, మాస్కులేకుండా తిరగడం, పండగలు, సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నా కూడా నగరంలోని కొందరు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. పుట్టిన రోజు పార్టీల పేరుతో గుంపులుగా చేరుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి కారణం ఇది కూడా ఒక కారణం. ఇటీవల జరిగిన వివాహాలకు హాజరైన వారికి చాలామంది కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలోనే నగరానికిచెందిన రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్ అలియాస్ జుంగిల్ యూసుఫ్ తనపుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు.
ఈ విషయం హబీబ్‌నగర్ పోలీసులకు తెలియడంతో రౌడీషీటర్‌పై పాండమిక్ కోవిడ్ కేసు బుక్ చేశారు. ఐపిసి 336,278,188 కింద కేసు నమోదు చేశారు. అలాగే నగరంలో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు, ఇప్పటి వరకు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 15వేలకు పై చిలుకు కేసులు నమోదు చేశారు. చాలామందికి జరిమానా విధించారు, మాస్కు ధరించని వారికి రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. కొందరికి జరిమానా, కేసులు నమోదు చేశారు.
ప్రత్యే నిఘా పెట్టిన పోలీసులు….
తెలంగాణలో సభలు, వేడుకలు, ర్యాలీలు, బహిరంగ సభలు అనుమతి లేకుండా నిర్వహించవద్దని పోలీసులు స్పష్టం చేసినా కొందరు వినడంలేదు. దీంతో వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. పార్టీలు చేసుకున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పాండమిక్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. ఇక నుంచి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్న పార్టీలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.