బ్రిటన్‌లో 8 రోజుల సంతాప దినాలు ప్రారంభం
లండన్: విండ్సర్ కాజిల్‌లో తన 99వ ఏట కన్నుమూసిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త, ఎడిన్‌బరో డ్యూక్ ప్రిన్స్ ఫిలిప్‌కు దేశంలోని అన్ని రాజధానులతోపాటు రాయల్ నేవీ నౌకలలో గాలిలో తుపాకీ కాల్పులతో గౌరవ వందనాన్ని సమర్పించారు. లండన్, కార్డిఫ్, బెల్‌ఫాస్ట్, ఎడింబరోలో శనివారం మధ్యాహ్నం ఎనిమిది రోజుల సంతాప దినాలకు సూచనగా నిమిషానికి ఒక కాల్పు చొప్పున 41 రౌండ్ల తూటాలను గాలిలో కాల్చి తమ దేశ సాంప్రదాయాన్ని ప్రభుత్వం కొనసాగించింది. 18వ శతాబ్దం నుంచి ఈ సాంప్రదాయం బ్రిటన్‌లో కొనసాగుతోంది. 1901లో విక్టోరియా మహారాణి మృతికి సంతాప సూచగా ఈ విధంగానే కాల్పులతో గౌరవ వందనం సమర్పించినట్లు రాయల్ వెబ్‌సైట్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్ నేవీలో పనిచేసిన ఎడింబరో డ్యూక్‌కు బలమైన సైనిక సంబంధాలు ఉన్నందుకు కూడా ఈ రకమైన గౌరవం లభిస్తోంది. సాయుధ దళాలకు ప్రిన్స్ ఫిలిప్ గొప్ప స్నేహితుడని, సూర్తిదాయకుడు, ఆదర్శప్రాయుడని, ఆయన మరణం తీరని లోటని బ్రిటన్ రక్షణ దళాల చీఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్ తెలిపారు.