లాహోర్: ప్రముఖ పాకిస్తానీ మానవ హక్కుల ఉద్యమ నేత, జర్నలిస్టు ఐఎ రహ్మాన్ సోమవారం కన్నుమూశారు. పాకిస్తాన్‌లోని హిందువులు, క్రైస్తవులతోసహా మైనారిటీల తరఫున బలంగా తన గొంతును వినిపించడమే కాక భారత్, పాక్ మధ్య శాంతి స్థాపన జరగాలని ఆకాంక్షించిన రహ్మాన్ తన 90వ ఏట కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
దేశ విభజనకు ముందు భారత్‌లోని హర్యానాలో 1930లో జన్మించిన రహ్మాన్ తన 65 ఏళ్ల జర్నలిస్టు జీవితంలో వివిధ పత్రికలకు సంపాదకునిగా పనిచేశారు. పాకిస్తాన్-ఇండియా పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమోక్రసీకి ఆయన వ్యవస్థాపక సభ్యుడు. ఆయన మధుమేహవ్యాధిగ్రస్తుడని, ఆయనకు అధిక రక్తపోటు కూడా ఉందని ది డాన్ దినపత్రిక తెలిపింది.
రహ్మాన్ అత్యంత అరుదైన వ్యక్తని, ఆయన లేని లోటు తీరనిదని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సిపి) మాజీ చైర్పర్సన్ జోహ్రా యూసుఫ్ పేర్కొన్నారు. హెచ్ఆర్సిపి డైరెక్టర్‌గా రహ్మాన్ రెండు దశాబ్దాలపాటు పనిచేశారు. ఆయన 2016 డిసెంబర్ వరకు దానికి సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేశారు. పాక్ సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆయన మూడు పుస్తకాలు కూడా రచించారు. రహ్మాన్ మృతికి అన్ని వర్గాల నుంచి సంతాపం వ్యక్తమవుతోంది. రహ్మాన్‌ను అచ్చమైన ఆదర్శప్రాయుడిగా అధికారిక పర్యటన నిమిత్తం జర్మనీలో ఉన్న పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి అభివర్ణించారు.