ఇసి నిర్ణయంపై నేడు మమత ధర్నా
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ ఎన్నికల ప్రచారంపై సోమవారం ఎన్నికల కమిషన్ 24 గంటలపాటు నిషేధం విధించింది. 12 రాత్రి 8 గంటల నుంచి 13 రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం ఉంటుంది. ఈ నిషేధ సమయంలో ఆమె ఏ రూపంలో నైనా ప్రచారం చేయకూడదు. కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా, మతపరమైన పదాలతో మమతా బెనర్జీ విమర్శలు చేశారని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో అలాంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలకు దారి తీస్తాయని, అలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయకుండా దూరంగా ఉండాలని ఇసి హెచ్చరించింది.
రాష్ట్రంలో ముస్లిం ఓటర్లంతా గంపగుత్తగా టిఎంసికి ఓటు వేయాలని ఇటీవల ప్రచార సభలో మమతాబెనర్జీ పిలుపునిచ్చారు. దీనిపై బిజెపి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ తీసుకున్న రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోల్కతాలో మంగళవారం ధర్నా నిర్వహించనున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. ఎన్నికల కమిషన్ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయానికి నిరసనగా కోల్కతా నగరం గాంధీ మూర్తి వద్ద మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ధర్నా సాగిస్తానని మమతాబెనర్జీ ట్విటర్లో ప్రకటించారు.