రేపటి అనుముల సభకు కెసిఆర్ హాజరు
భారీగా ఏర్పాట్లు చేసిన గులాబీ శ్రేణులు
భద్రతావలయంలో ‘సాగర్’ సభా స్థలం
అనుముల దేవరకొండ రోడ్డులో ప్రాంగణం
పెద్ద ఎత్తున తరలిరానున్న సబ్బండ వర్గాల ప్రజలు
గులాబీమయం కానున్న నాగార్జునసాగర్
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: గులాబి దళపతి, ముఖ్యమంత్రి కెసిఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల సభకు సర్వం సన్నద్ధమైంది. ఉపపోరులో భాగంగా నియోజకవర్గంలో ఉప్పెనలా కొనసాగుతున్న అధికార పార్టీ ప్రచారానికి అధినేత ఆగమనం మరింతగా రెట్టింపు ఉత్సాహాన్ని ఇవ్వనుంది. నియోజకవర్గం పరిధిలోని ప్రధాన కేంద్రమైన హాలియా పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల పాత ఐటిఐ కళాశాల ఎదురుగా గల స్థలంలో సిఎం సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు ఇప్పటికే పూర్తి చేయగా, బందోబస్తు కోసం భారీ ఎత్తున పోలీసులను తరలిస్తున్నారు. గులాబీ దళపతి సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నారని కారు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
పతిష్టాత్మకమైన సిఎం సభ ఏర్పాట్లను గడిచిన నాలుగైదు రోజులుగా మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జ్ రవీందర్‌రావులతో పాటు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఐజి రంగనాధ్‌లు తదితరులు అనుక్షణం పర్యవేక్షిస్తూ ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఈనెల 14వ తేదీన బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నేరుగా నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు సభాస్థలికి చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన జరిగిన అభినందన సభ అనుభవాలతో ఈనెల 14వ తేదీ బుధవారం బహిరంగ సభ ఏర్పాట్లను నిశిత పరిశీలనతో చేపడుతున్నారు ఒక వైపు పార్టీ యంత్రాంగం, మరోవైపు అధికార యంత్రాంగం. నియోజకవర్గ వ్యాప్తంగా 50వేల మందితో తలపెట్టిన బహిరంగ సభ ఏర్పాట్లతో పాటు భద్రతా చర్యల విషయంలో సిఎం భద్రతా అధికారులు సైతం నిరంతరం పర్యవేక్షిస్తుండగా అధికార యంత్రాంగాలు సైతం పనులు చక్కబెడుతున్నాయి.
భద్రతా చర్యలు కట్టుదిట్టం… అనుముల కెసిఆర్ బహిరంగ సభకు తరలివచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయనున్నారు. సబీకులకు సమస్యలు తలెత్తకుండా పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారి, డిఐజి రంగనాధ్ నేతృత్వంలో సభ ప్రాంగణం వద్ద ప్రజలకు ఇబ్బందులు ఎదురవ్వకుండా, వాహనదారులకు సైతం ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ప్రచారం గరంగరం… నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రోజురోజుకు గరంగరంగా కొనసాగుతోంది. అధికార పార్టీ మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రచారంలో పై చేయి సాధిస్తున్నప్పటికీ ప్రతిపక్షాల ముఖ్యనాయకులు నియోజకవర్గంలో అడపాదడపా హల్‌చల్ చేసి వెళ్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు నియోజకవర్గం ఓటర్ల మనస్సు గెలిచేందుకు బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంటున్న సందర్భంలో ఉప ఎన్నికల్లో ఎలాగైనా పై చేయి సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
ప్ర ధాన పార్టీలు ప్రతిష్టాత్మకం గా తీసుకున్న సాగర్ ఉప ఎ న్నికల్లో గెలుపు లక్షంగా ముందుకుసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీల ప్ర చారం ముఖ్యనాయకులతో కొనసాగుతుండగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందడంలో ముందుకు వరసులో ఉందని చెప్పవచ్చు. మంత్రులు జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌అలీ ఇలా ముఖ్యమైన మంత్రులతో పాటు ఇతర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక బిజెపి అభ్యర్ధ్ది రవికుమార్, కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డిల ప్రచారాలు నువ్వా నేనా అన్న రీతిలో సాగుతున్నాయి. ప్రచారంలో ప్రధాన పార్టీ ప్రసంగాల్లో మాటల తూటాలు దూసుకెళ్తున్నాయి.