ముంబై: ఈ ఐపిఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ మూడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో 148 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒక దశలో 42 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌ను డేవిడ్ మిల్లర్ ఆదుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మిల్లర్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. చివర్లో క్రిస్ మోరిస్ 4 సిక్స్‌లతో అజేయంగా 36 పరుగులు చేయడంతో రాజస్థాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఉనద్కట్ జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి రాజస్థాన్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్ ఆరంభంలోనే చుక్కలు చూపించాడు. నిప్పులు చెరిగే బంతులతో విరుచుకు పడిన ఉనద్కట్ వరుస క్రమంలో వికెట్లు తీస్తూ ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశాడు. ఓపెనర్లు పృథ్వీషా (2), శిఖర్ ధావన్ (9)లను ఉనద్కట్ పెవిలియన్ పంపించాడు. అంతేగాక వన్‌డౌన్‌లో వచ్చిన సీనియర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానె (8)ను కూడా ఔట్ చేశాడు. మరోవైపు స్టోయినిస్ (౦) ముస్తఫిజుర్ రహ్మాన్ వెనక్కి పంపించడంతో ఢిల్లీ 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
పంత్ ఒంటరి పోరాటం..
ఒకవైపు వికెట్లు పడుతున్నా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఒంటరి పోరాటం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించాడు. అతనికి లలిత్ యాదవ్ (20) అండగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పంత్ 9 ఫోర్లతో 32 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. టామ్ కరన్ (21), క్రిస్ వోక్స్ (15), రబడా 9 (నాటౌట్) కాస్త రాణించడంతో ఢిల్లీ స్కోరు 147 పరుగులకు చేరింది.
IPL 2021: RR win by 3 wickets against DC